పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అతఁడు నతిబహులనిద్రాయుతుఁ డై యున్నాఁడు గాచు టొప్పదె సంబో
ధితుఁ జేసి తెచ్చి సేవా, రతుఁ జేసెద ననిన దనుజరా జి ట్లనియెన్.

19


చ.

అలఁతులఁ బోవు తప్పె యిది యైనను నాతఁడు నేతికుండపై
యెలుక సలంబుఁ బోవిడిచి యేను భవత్పతిఁ గాచితిన్ మనం
బలరఁగఁ బోయి నిద్ర దెలియంగ సుపాయము సేయు నాకు నె
చ్చెలి యగుఁ దోడితె మ్మనినఁ జేడియ సమ్మద మంది క్రమ్మఱన్.

20


చ.

చని పతి నిద్ర దెల్పి దనుజప్రభురాకయుఁ దాను బోకయున్
మన మలరంగ బాంధవపుమాటలు సంధి దగంగఁ జేసి యా
తనిఁ దమయన్నపాలికి ముదంబునఁ దోకొనిపోవఁ బూని వ
చ్చినతన దైనపూనికయుఁ జెప్పిన గొండొక సమ్మతించుచున్.

21


క.

మీయన్నకుఁ దేజముగాఁ, బోయి యతనిఁ గంటి నన్ను బోధింపవ యే
నాయనకుఁ జాల నని యిఁకఁ, జేయునదియుఁ గలదె గడవఁ జేసితి తరుణీ.

22


క.

ఈచనవు సెల్ల నిచ్చితి, నీ చెప్పినయట్ల యతని నేఁ గనియెద మై
త్రీచాతుర్యసమగ్రుఁడ, నై చేసెదఁ బిదపఁ దగుసహాయం బెల్లన్.

23


ఆ.

అని యలంకరించుకొని తనసేన స, న్నాహసుందరముగ నడవఁ బనిచి
వారణేంద్రు నెక్కి వచ్చి బావకుఁ బొడ, సూపె మధువు పెంపుసొంపు మిగుల.

24

మధుఁడును రావణుఁడు నింద్రునిపై దండెత్తుట

ఉ.

ఆదశకంధరుం డుచిత మయ్యెడుభంగి మఱందికిన్ మహా
హ్లాద మొనర్చి పేర్చి యమరాధిపుపై నడవం దలంచు ట
త్యాదరలీలఁ జెప్పి తగ నప్పురి నాఁడు వసించి యాతఁడుం
గా దన కెత్తి తో నడవఁ గా మఱునాఁ డటఁ బోయె నుధ్ధతిన్.

25


ఉ.

రావణుఁ డిట్లు దేవనగరంబుపయిన్ బలపాదధూళివి
ద్రావితసర్వదిగ్వలయరాజకులుం డగుచుం గడంక మై
బోవునెడం బథంబున నభోవిభవంబుఁ దిరస్కరించుశృం
గావళి నుల్లసిల్లురజతాద్రిఁ గనుంగొని కౌతుకంబునన్.

26


ఉ.

శూలినివాస మై తెలుపుసొంపునఁ బొంపిరివోవు నమ్మహా
శైలముచక్కిఁ జక్కటికి సప్తతురంగముఁ డేగు దెంచి యు
త్తాలపుదేవగేహము సుధం జెలునొందఁగ నందుఁ బేర్మికిం
జాలి వెలుంగురత్నకలశంబువిధంబునఁ దేజరిల్లెడున్.

27


ఆ.

అనుచు నగముఁ జేర నరిగి రక్షోవంశ, కరుఁడు దానిసొంపు గలయఁజూచి
యనుఁగుఁదమ్మునికిఁ బ్రియమ్మునఁ జూపుచు, నిట్టు లనియె వేడ్క యెసక మెసఁగ.

28