పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముఖపాండిత్యవిభూతి గలవాఁ డగుటమి బహుళార్థంబు గలభావంబు సంగ్రహించి యొకటిరెండుపద్యంబులలో నిముడ్చుటకును, నల్పాభిప్రాయంబునకుం జిన్నెలు వన్నెలు గల్పించి విపులంబుగా రమణీయంబుగా వ్రాయుటకును నేర్చినవలంతి. వేయేల? ఎఱ్ఱాప్రెగడ, శ్రీనాథుఁడు మున్నగుమహాకవులకే యీతనికవనమున నెఱుంగఁ దగినయంశము లనేకము లున్నవనఁ దక్కుంగలకవులఁ జెప్ప నేల? ఈతనికవిత్వంబున సందర్భోచితరీతిఁ బ్రయుక్తంబు లై చక్కనిలోకోక్తులు శ్రోతలం బఠితల నానందార్ణవతలనిమగ్నాంతరంగులం జేయుచున్నవి. ఉదాహరణములు — 'చెవులు పట్టి యాడించు' పు. 37 ప. 22, 'ఒడల్ సిదిమినఁ బాలు వచ్చు' పు 102 ప 22. 'నేతికుండపై యెలుక' పు. 107. ప. 22 ఇట్లు గనుంగొనఁ దగినది.

ఈకవి తనకవిత్వంబున పాదపూరణంబుగ వ్యర్థపదములం బ్రయోగింపక (నిర్వచనోత్తరరామాయణము 1 వ పుటలోఁ) దాఁజేసినప్రతిజ్ఞనుఁ జెల్లించుకొనెను. ఈతనికవనంబున శబ్దచిత్రంబులు నర్థాలంకారములు విరళంబులు. కాలిదాసాదులకుఁబోలె నీకవికి నుత్ప్రేక్షోల్లేఖాదులకంటె నుపమారూపకస్వభావోక్తులు గడుఁబ్రియములు.

ఉదాహరణము.—

ఉ.

చారుబలాకమాలికల చాడ్పున దంతము లొప్ప గర్జిత
స్ఫారరవంబులట్లుగ నభంగురతం బటుబృంహితంబు లా
సారముమాడ్కి దానజలసంతతి గ్రమ్మఁగఁ గాలమేఘమా
లారుచిరంబు లై మద చలద్ద్విపసంఘము లొప్పు నప్పురిన్.

1 ఆ. 53 ప.


సీ.

అనవద్యవేదవిద్యాలతావితతికి, నాలవాలములు జిహ్వాంచలములు......

1 ఆ. 57 ప.


సీ.

పడఁతుల నెఱివీగుఁ బాలిండ్లు వెడదోఁప, లీలఁ బయ్యెదలు దూలించుటకును..

1 ఆ. 59 ప.

శబ్దాలంకారంబులలో నీకవికిఁ బ్రియమైనది రెండురెండు గాని, మూఁడుమూఁడు గాని, పద్యములో నన్నియుఁ గాని సమాసములయం దంత్యాక్షరవ్యావృత్తినియమము. ఉదా:—

మ.

అతులౌదార్యుఁ డహీనశౌర్యుఁడు సముద్యద్ధైర్యుఁ డత్యంతవి
శ్రుతచారిత్రుఁడు సూరిమిత్రుఁడు జనస్తోతవ్యగోత్రుండు సం
భృతసత్కీర్తి పవిత్రమూర్తి యసుహృద్బృందార్తినిర్వర్తి పూ
జితధీమంతుఁడు పుణ్యవంతుఁడు జయశ్రీకాంతుఁ డిమ్మేదినిన్.


చ.

నిరుపమమూర్తి వైరిరథినీసమవర్తి వివేకవైభవ
స్ఫురితవిచారుఁ డుజ్జ్వలయశోమణివహారుఁడు ధర్మసంగ్రహా
దరపరతంత్రుఁ డార్యజనతామతమంత్రుఁడు వంశవారిజా
కరనవసూర్యుఁ డస్ఖలితగౌరవవర్తనధుర్యుఁ డిమ్మహిన్.

3 అ. 119 ప.