పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కవిసార్వభౌమునిసరసకవితానిర్మాణకౌశల మిట్టి దని వక్కాణింప నేరితరము. ప్రబంధపరమేశ్వరుం డనాఁ గవిపుంగవులనడుమ వన్నె కెక్కినయెఱ్ఱాప్రెగ్గడ తనహరివంశములో నీతని—

తనకావించినసృష్టి తక్కొరులచేతం గాదు నా నేముఖం
బునఁ దా బల్కినపల్కు లాగమము లై పొల్పొందు నావాణిన
త్తను నీతం డొకరుండు నాఁ జనుమహత్వ్యాప్తిం గవిబ్రహ్మ నా
వినుతింతుం గవితిక్కయజ్వ నిఖిలోర్వీదేవతాభ్యర్చితున్.

అని కవిబ్రహ్మ కాఁ గొండాడియున్నాఁడు.—

నిరవధికకోమలపదమధురసరససరస్వతీవిలాసవైభవంబునను వేదమార్గప్రవర్తకత్వంబున నీతని నపరకృష్ణద్వైపాయనుం డనియే చెప్ప నొప్పును. మహాభారతంబున నాశ్వాసాంతపద్యంబులం జూడ నితం డద్వైతమతావలంబి యనియుఁ బూర్వోత్తరమీమాంసాశాస్త్రములయందును, వ్యాకరణమునందు నసమానపాండిత్యము గలవాఁడనియు గోచరింపకమానదు. ఇతఁడు కాళిదాసాదులువోలె సకలశాస్త్రమర్యాదల సమగ్రముగ నెఱింగిన పండితకవీంద్రుఁడు. ఇయ్యది భారతంబున నాయాఘట్టంబుల భాషాంతరీకరించుతఱి నెఱుంగనగు. ఈతనికి గీర్వాణాంధ్రంబుల నెక్కుడు వైశారద్యంబుకలిమి నుభయకవిమిత్రుం డనుబిరుదము గలిగె. సోమయాజి యగుటఁ బరమాస్తికాగ్రేసరుం డనియుఁ, గర్మాచరణదీక్షాదక్షుం డనియుఁ దెలియుచున్నది. ఇక్కవినాథురచన లాంధ్రభాషాభిమానుల కాగమములు. ఈరసికు సరసంపుఁబలుకు లాంధ్రభాషాయోషాభూషణములు. ఈతనికృతు లాంధ్రకవిపుంగవులకుఁ గవితామార్గప్రదర్శకములు. ఆంధ్రభాషాతత్వము నెఱింగినకోవిదులలో నీతం డపరశబ్దశాసనుఁడు. ఇక్కవీంద్రునకు గీర్వాణభాషావైశారద్య మెక్కుడయ్యును గవనంబునం దెలుఁగుపలుకులే తఱచుగాఁ గాన్పించును. కవనంబున జల్లిపదంబుల నిఱికింపక కాదాచిత్కముగ ననతిదీర్ఘసమాసములం బొందుపఱచుచుఁ జిన్నచిన్నపదములం గూర్చి యతిప్రాసములకుఁ దడవుకొనక సరళముగా హృదయరంజకముగాఁ గవన మల్లుటయ యీకవికి నైజము. సంస్కృతంబున బాణభట్టప్రథమకృతి యగుహర్షచరిత్రమునంబోలెఁ దిక్కన బాల్యకృతి యగునుత్తరరామాయణంబున నవిచ్ఛిన్నకవితాధారకుఁ గొన్నియెడల సంకోచంబు గలిగినను, కాదంబరింబోలె భారతంబున నారితేరి సర్వాలంకారశోభిత యై నవరసోపేత యై సరసగుణసమేత యై ప్రౌఢకవితాయువతి దద్దయు సహృదయహృదయాంబుజంబుల నలరించుచున్నది. సమయౌచితింబట్టి యేరసంబు వర్ణించుతఱి నెట్టిపదములం గూర్చిన రసము గృహీతాకృతివోలె సహృదయహృదయదర్పణంబులఁ బ్రతిబింబించునో, యట్టిమధురపదంబులం బొందించువిషయము నిక్క విచంద్రుఁ డెఱింగిన ట్లొరు లెఱుంగరు. సర్వతో