పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూలములో నున్నవిషయముల నన్నింటిని వరుసగానే చెప్పవలయు ననియు సంకల్పించినవారు కారు. దీనికిఁ గారణము తమకావ్యములు స్వతంత్రములుగా నుండవలయు ననియుఁ గవితాధార దడవుకొనినట్లుండక యవిచ్ఛిన్నముగా నుండవలయు ననియుఁ దలంచుటయ. లోకములో ఒక భాషశైలి మఱియొకభాషశైలికిఁ గొన్నియెడలం బోలియునికియుఁ బెక్కుతెఱంగులం బోలకయునికియుం గలదు. గీర్వాణంబునం గర్మణిప్రయోగ మింపు నింపును. ఆంధ్రంబున నది యంతగా రుచింపదు. మఱియు దేవభాష వంశస్థము, ఉపేంద్రవజ్ర, ఇంద్రవజ్ర, ఆర్య మున్నగు వృత్తములు రచన కనుకూలములుగను విన సొంపుగ నుండును. తెలుఁగున సీసము, గీతము, చంపకమాల, మత్తేభము లోనగువృత్తములు సొగసుగ నుండుఁ గాని వసంతతిలకాదు లంతరమణీయములుగ నుండవు. కొన్నిజాతీయము లాంధ్రంబునం గొన్ని గీర్వాణంబునను సహృదయహృదయానందంబు నొందించు. ఇ ట్లొక్కొకచంద మొక్కొకభాష కందంబుఁ బొందించుటం జేసి యాయాభాష కనుగుణం బగుశైలిం గబ్బంబు రచించుటయ కమనీయంబు. మహాకవు లగునన్నయ, భాస్కరుఁడు, తిక్కన, శ్రీనాథుఁడు లోనగు వా రీఘంటాపథమునకు వెలి గాకయే కావ్యనిర్మాణమునకుం గడంగిరి. అట్లుగాక మూలమునకు నన్నివిషయంబుల సరిగ భాషాంతరీకరణము సేయునిర్బంధమునకు లోగిన నట్టిభాషోచితశైలి యలవడుట దుస్సాధము. కాఁబట్టియే తిక్కనామాత్యుఁడు నిర్వచనోత్తరకాండకథ నూఁతగాఁ గైకొని వర్ణనాదులఁ దనయిచ్చవచ్చినట్లు స్వతంత్రముగ రచియించె. అయినం గొన్ని యుచితస్థలములు మూలము ననుసరించియు నాంధ్రీకరించి యున్నాఁడు.

ఉత్తరకాండలోని—

సువర్ణపృష్ఠే స బభౌ శ్యామః పీతాంబరో హరిః,
కాంచనస్య గిరే శ్శృంగే సకటి త్తోయదో యథా.

అనుశ్లోకమును—

క.

గరుడునిపై శార్ఙ్గధను, ర్ధరుఁ డగువిష్ణుండు మేరుతటిఁ బొల్చుకటి
త్పరివృతజలదముఁ బోలుట, విరియ దనుజరాజహంసవితతి యితనికిన్.

అనియు, నిట్లే కొన్నికొన్నియెడలం గొంచె మించుమించుగఁ దెలిఁగించి యున్నాడు. కథాభాగములో సంస్కృతంబున బహుళంబుగ నున్నయెడం బ్రధానకథాంశమును మాత్రము వివరించుచు మిగుల సంక్షేపించి శ్రీరామనిర్యాణమును వదలి 10 యాశ్వాసములప్రబంధమును వ్రాసెను. సంక్షిప్తభాగంబుల సూక్ష్మదృష్టిచే గ్రంథంబునం జూచుకొనునది.