పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వము హరిహరనాథాలయ ముండిన యిప్పటిరంగనాథదేవాలయముదగ్గఱ నిల్లు గట్టించి తిక్కన నందుఁ గాపురం బుంపఁగా నారాజాస్థానంబున నమాత్యుండును, విద్వత్కవీంద్రుండును నై దిగంతవిశ్రాంతకీర్తిం గైసేసి వైదికకర్మానుష్ఠానతత్పరుం డగుటమిఁ బినాకినీతీరంబున జన్నంబు సేసి తిక్కనసోమయాజి నాఁ బరఁగి హరిహరనాథున కంకితంబుగా విరాటపర్వంబుఁ దొడంగి మహాభారతంబు నాంధ్రీకరించె ననియుఁ దరువాత మనుమసిద్ధిమరణముతో నాతనివంశ మంతరింపఁ దిక్కనసోమయాజికుమారుఁ డగుకొమ్మన నెల్లూరికి రెండుకోసులదూరమున నున్న పాటూరికరణీకమును సంపాదించికొని యచ్చట నివసించె ననియు, నాకారణమున నీకవివంశమువారికిఁ బాటూరువా రనుపేరు వచ్చిన దనియు, నేతద్వంశ్యులు చెప్పుచున్నారు. ఈపాటూరువారు పాటూరిలోఁ గొందఱు నిందుకూరిపేటలోఁ గొందఱు నున్నారు.

తిక్కనామాత్యుడు నిర్వచనోత్తరరామాయణమును, పంచమవేదమనాఁ బరఁగుభారతంబును (విరాటపర్వము మొదలు 15 పర్వములు) రచియించెను. మఱియు నీతఁ డవసానకాలమున ముద్దులమూటఁ గట్టు గృష్ణశతకమును రచియించెనఁట. నన్నయభట్టు భారతము నారణ్యపర్వముదనుక నాంధ్రీకరించి మృతిబొందఁగా నారణ్యపర్వముం దెలింగించుట నాతనికి మతిభ్రమణము గలిగి కీర్తిశేషుఁ డయ్యె నని తలంచి దానికి శంకించి యరణ్యపర్వశేషముం బూర్తిసేయఁ దొరకొనక తక్కుoగల పదియేనుపర్వముల రచించెనని చెప్పుదురు.

తిక్కన నిర్వచనోత్తరరామాయణ మొనర్చుతఱికి యజ్ఞము సేసి యుండలేదని యాశ్వాసాంతగద్యమువలనం దెలియుచున్నది.

ఈగ్రంథములు నెల్లూరి కధిపతి యగుమనుమసిద్ధిరాజున కంకిత మొనర్చెను. మనుమరాజు తిక్కనపై మిక్కుటంపుమక్కువచే మామవరుసం బిలుచుచున్న ట్లీకావ్యము ప్రథమాశ్వాసములోని—

క.

ఏ నిన్ను మామ యనియెడి, దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక నా
కీ నర్హుఁడ వగు దనినను, భూనాయకుపల్కు చిత్తమున కిం పగుడున్.

అనుపద్యమువలనం దెలియు చున్నది.

ఇంక నీతనిభాషాంతరీకరణముంగుఱించి యించుక విచారింపవలసియున్నది. పూర్వకాలమున నాంధ్రకవులు, పురాణములు నితిహాసములం దెలిఁగించుతఱిఁ గథాసందర్భము మాత్రము మాఱకుండునట్లు కొంతదనుక బాటించుచు వచ్చిర కాని మూలములో నుండు ప్రతిపదమునకు సరి యైన తెలుఁగుపలుకుల నిఱికింపవలయు ననియు, మూలములో లేనివర్ణనలను గల్పనలను జేయరా దనియు,