పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుపద్యమువలనను దెలియుచున్నది.

ఇంక నీకవి జీవించియుండుకాలముం గుఱించి పలువురు పలుతెఱంగులం దలాతలి వాదంబు సేయు చున్నను నిరర్థకాంశవిచారము పిష్టపేషణమ కా దలంచి హేతువాదంబునం దిగక సంగ్రహముగఁ దెలుపు చున్నాఁడ.

నిర్వచనోత్తరరామాయణమునకుం గృతిపతి యగుమనుమసిద్ధినృపాలుఁడు శాలివాహనశకము 1179-1182 (క్రీస్తుశ. 1258-1261) సంవత్సరములలో భూదానముఁ జేసినట్లు కృష్ణామండలములోని శిలాశాసనములవలనం దెలియుచున్నందునను, ఈమనుమరాజు రాజ్యముఁ గోలుపోఁగా [1254 సంవత్సరములో అక్కన బయ్యన యనుచోళులం జయించినట్లు కృష్ణామండలములో ఇనిమళ్ల గ్రామములోని శాసనము మున్నగు పెక్కుశాసనములచే క్రీ॥ 1200-1258 సంవత్సరముల నడుమ రాజ్యము చేయుచున్నట్లు తెలియుచున్న] గణపతిదేవుఁడు తిక్కనసోమయాజిప్రార్థనమువలన దండయాత్ర వెడలి వెలనాటిరాజులం జయించి నెల్లూరి కేగి మనుమసిద్ధిరాజుకు మరల రాజ్యంబు నొసంగినట్లు సోమదేవరాజీయమునం జెప్పంబడియున్నందునను, వారికి సమకాలికుఁ డగుతిక్కనసోమయాజియు శాలివాహనశకము 1127–1171 (క్రీ. 1200-1259) సంవత్సరములనడుమఁ దప్పక సశరీరుఁ డై యుండెననుట నిర్వివాదాంశము.

ఈ తిక్కనతాత యగుమంత్రిభాస్కరుంగుఱించి పెక్కుకవులు స్తుతిపద్యంబులం జెప్పి యునికి నేతద్వంశజులు రాజకార్యనిర్వాహదూర్వహు లనియ కాక యితనివంశము పండితవంశ మనియుం గూడ తేటపడుచున్నది. ఈకవికిఁ బూర్వులు మహారాజాస్థానములం గొప్పయుద్యోగము లొనర్చి జగద్విఖ్యాతిఁ గన్న మహాభాగులు. వీరినివాసస్థలము కృష్ణామండలములోని వెలటూ రనుగ్రామము. ఉద్యోగధర్మమున మంత్రిభాస్కరునికాలములో గుంటూరున నుండుటం జేసి గుంటూరువా రని పేరు వచ్చినదే కాని వీరియింటిపేరు కొట్టరువువారు. ఈవిషయమును గూర్చి అభినవదండి కేతన దశకుమారచరితలో—

గీ.

మనుమసిద్ధిమహేశసమస్తరాజ్య, భారగౌరేయుఁ డభిరూపభావభవుఁడు
కొట్టరువుకొమ్మనామాత్య కూర్మిసుతుఁడు, దీనజనతానిధానంబు తిక్కశౌరి.

అని వచించియున్నాఁడు. తిక్కనతండ్రి కొమ్మనామాత్యుఁడు గుంటూరికి దండనాథుఁడుగా నుండెను. ఈ కొమ్మనామాత్యుఁడు నెల్లూరిలో ధర్మపత్నిం గైకొని బంధుత్వమున నెల్లూరికి రాకపోకలు జరుగుచుండ మనుమసిద్ధినృపాలపరిచితి గలిగె ననియు, దానం జేసి మనుమరా జీకవికుటుంబము నాదరించి నెల్లూరికిం బిలిచికొని వచ్చి