పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆనేర్పుతోన వెసఁ జతు, రాననుఁడును సురలు నరిగి రవ్వాణియు దై
త్యాననముఁ బాసి పోయెను, దానవుఁడుఁ దలంచుకొని వృథాచింతనుఁ డై.

82


క.

ఏరూపున నే ని ట్లని, కోరితి నిది యేమి యొక్కొ కుత్సిత మయ్యెన్
ఘోరతప మెల్ల దీనికిఁ, గారణ మాసురలవలని కపటము సుమ్మీ.

83


క.

అని వగచుచున్న నాతనిఁ, గనుఁగొని ఖేదమునఁ బంక్తికంఠుఁడు సేరం
జనుదెంచి తానుఁ దమ్ముఁడు, ననునయ మొనరించి సముచితాలాపములన్.

84


క.

కొనియాడిన నాఱవ నెల, కును నొకదినమందు లేచుఁ గుడుపును గమనం
బును గల్గు నాఁడు పగతుర, కనిలోనన్ విజయుఁ డీతఁ డని యజుఁ డరిగెన్.

85


క.

వనజభవుచేత నివ్విధ, మున వరములు వడసి పంక్తిముఖుఁ డుద్ధతుఁ డై
యనుజులతో శ్లేష్మాతక, వనమున సుఖ ముండె దనుజవర్గము కొలువన్.

86

సుమాలిబోధనచే రావణుఁడు లంకను వశపఱచుకొనుట

తే.

ఇంతయును జెప్ప విని రాఘవేశ్వరుండు, మిగుల నచ్చెరువడి యటమీఁద వారి
చరిత మెట్లొకొ నావుఁడు ధరణిపతికి, నయ్యగస్త్యమునీంద్రుఁ డి ట్లనియెఁ బ్రీతి.

87


సీ.

కైకసి దీనికిఁ గడుసంతసంబునఁ దేలుచు నుండ సుమాలి తనదు
దౌహిత్రుఁ జూడఁ బాతాళలోకంబున నుండి మారీచమహోదరులును
నవ్విరూపాక్షప్రహస్తులు నాదిగా సచివులుఁ దక్కటిసైన్యపతులుఁ
గొలిచి రాఁ జనుదెంచెఁ గుంభకర్ణవిభీషణులు దోన చన దైత్యకులవిభుండు


ఆ.

నెదురువోయి భక్తి నెరఁగి సమాలింగి, తాంగుఁ డై విభూతి యతిశయిల్లఁ
దననివాసమునకుఁ గొనిపోయి సముచితా, చారవిరచితోపరచారుఁ డయ్యె.

88


క.

వినయము దగఁ బాటించుచుఁ, దనపార్శ్వమునందు సముచితం బగురుచిరా
సనమున నాసీనుం డగు, మనుమనితో నిట్టు లను సుమాలి ప్రియమునన్.

89


శా.

మావంశంబు ప్రసిద్ధిఁ బొందు హరి పల్మాఱున్ సురేంద్రాదులం
గావన్ దానవమర్దనంబు గడఁకం గావించుటల్ మాను నా
దేవానీకముత్రు ళ్లడంగు విభవోద్రేకంబు శోభిల్ల దై
త్యావాసత్వముఁ గాంచు లంక భవదీయస్ఫారవీరోద్ధతిన్.

90


శా.

లంకాపట్టణ మేలి యే నసమలీలం గ్రాలి దేవేంద్రుపైఁ
గింకన్ దాడిగఁ బోయినన్ సురల రక్షింపంగ వేగంబ చ
క్రాంకుం డడ్డము వచ్చినం దెరలి దైన్యం బొంది పాతాళ మా
తంకం బేర్పడఁ జొచ్చి యం దఁడగి యిందాఁకన్ వగం గుందుచున్.

91


క.

ఉన్నంత నీవు గలిగితి, బన్నంబులు దలఁగ నింక బగఱ నొడుతు మీ
కిన్నరుఁడు రిత్తగాఁ డిటు, గొన్నపురము మున్ను మగుడఁ గొనఁగావలయున్.

92


క.

మాతామహుఁ డిటు దనకుం, జేతోముద మంద నీతి సెప్పిన మదిలోఁ
బ్రీతుం డయ్యును దశముఖుఁ, డాతనిచిత్తంబుచంద మారయుబుద్ధిన్.

93