పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గనుఁగొని క్రమ్మఱం దలలు గ్రక్కునఁ గల్గ ననుగ్రహించి ప్రీ
తి నొసఁగె నుజ్జ్వలంబు లగుదివ్యశరంబులుఁ గామరూపమున్.

71


క.

వెల్లువ ముంచి పిదప నీ, రెల్లను వెస డొంకఁ గొలన నెసఁగెడుచంచ
త్ఫుల్లారవిందములక్రియ, నల్లన వదనములు దోఁచె నాశ్చర్యముగాన్.

72

విభీషణునకు బ్రహ్మ వరంబు లిచ్చుట

మ.

అజుఁ డి ట్లద్భుతభంగిఁ బంక్తిముఖు నన్వర్థాభిధానోజ్జ్వలుం
ద్రిజగద్వీరునిఁ జేసి దుష్కరతపోదీక్షాప్రవృత్తిప్రకా
రజితాత్ముం డగునవ్విభీషణు వరప్రాప్తోన్నతుం జేయఁగా
నిజబుద్ధిం దలపోసి వానిఁ గరుణాస్నిగ్ధాత్ముఁడై చూచుచున్.

73


తే.

ధర్మనియతికి మెచ్చితిఁ దపము పండె, వత్స నీమది వలసినవరముఁ గోరు
మనిన భయభక్తిసంభ్రమహర్షభరిత, హృదయుఁ డై యతఁ డాతని కిట్టు లనియె.

74


ఉ.

ప్రీతుఁడ నంటి నాతపముపెంపున నీవల దీని కగ్గలం
బై తగుకోర్కియుం గలదె యైనను గోరెద నామనంబు ధ
ర్మేతరవృత్తికిం జనమి యిష్టవరం బగు ధర్మవర్తులై
పూతగుణాభిరాము లగుపుణ్యులకున్ సులభంబు లెవ్వియున్.

75


క.

అనుపలుకుల కచ్చెరుపడి, దనుజులలోఁ బుట్టి నీవు ధర్మంబు మనం
బునఁ గోరుట యరు దిచ్చితి, నని యజుఁ డమరత్వమును నిజాస్త్రము నిచ్చెన్.

76

కుంభకర్ణుని తపగఫలము

ఆ.

ఇవ్విధమున శంభుఁ డవ్విభీషణుఁ బ్రీతుఁ, జేసి కుంభకర్ణుఁ జేరఁ బిలువఁ
దలఁచు టెఱిఁగి దేవతలు దేవ విన్నప, మవధరింపుఁ డనుచు నజునిఁ జేరి.

77


సీ.

అప్సరోగణము విహారంబు సలుపంగఁ దునిమెఁ బెక్కండ్ర నందనమునందుఁ
దపములు సేయ మందరకుధరంబులో నురవడి మునులఁ బల్వుర వధించె
నిల నెల్లయెడల ననేకభూసురులు యాగము లొనరింపఁ బ్రాణములు గొనియెఁ
దెరువుల నరుగంగ సరికట్టి చంపె నాబాలవృద్ధంబుగా బహుజనముల


తే.

వేచి యాహారమున కని వేడ్క కనియు, నఖిలజీవుల నిట్లు నిత్యంబు సమయఁ
జేయు నీవరమున నిఫ్డు సిద్ధుఁడయిన, నితఁడు సైరించునే లోకహితవిచార.

78


క.

కావున నీతని మోహితుఁ, గావించుట జగము లెల్లఁ గాచుట సుమ్మీ
నావుడుఁ దలఁపున భారతి, రావించిన వచ్చుడును సురజ్యేష్ఠుండున్.

79


ఆ.

అసురమోమునందు వసియించి నను నిద్ర, యడుగు మనిన వాణి యట్ల చేయు
దాన ననుచుఁ జనియె దానవుఁ బిలిచి నీ, కాంక్ష సెప్పు మనియెఁ గమలభవుఁడు.

80


క.

నిద్ర దయసేయు మనియె సు, రద్రోహియు నమరవరులు రదనాంకురచం
చద్రుచులు నిగుడ నవ్వుచు, భద్రము మా కదియె యనఁగఁ బద్మజుఁ డిచ్చెన్.

81