పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ముని యమ్మానినియింగిత, మును నెఱిఁగియు దివ్యబోధమున నేర్పడ నె
ల్ల నరసి యల్లనినగవున, మునింగి మృదుమధురవాక్యముల ని ట్లనియెన్.

51


చ.

జనకుఁడు గోరి నిర్మలవిచారమునం దగ నిశ్చయించి ని
న్ననుమతి సేయ నీవును బ్రియంబున నియ్యెడ కేగుదెంచు టె
ల్లను నగు నాదెసం దనయలాభముఁ గోరితి వియ్యకొంటి నే
ను నకట వేళ క్రూరము తనూజులఁ గ్రూరులఁ గాంతు కామినీ.

52


చ.

అనవుడు మీకృపం బడయు నాత్మజు లుగ్రులు గాఁగఁ బాడి గా
దనవుడు నీదుసంతతికి నంతకుఁ గొండొకవాఁడు శాంతుఁ డై
వినయవివేకధర్మముల విశ్రుతబుద్ధి వహించు మత్కులం
బును భవదీయవంశమును బూతము సేయు సరోజలోచనా.

53


క.

అని యూఱడించి ముని య, వ్వనితం గైకొనియె నదియు వల్లభుచిత్తం
బునకుఁ దగుచరిత మన్ననఁ, గని సంతస మంది కొంతకాలంబునకున్.

54


క.

పదితలలుం గోఱలు నిరు, వదిచేతులు నిరులు గవియు బలుమేనును గెం
పొదవిననయనంబులు ను, న్మద మగుహృదయంబుఁ గలతనయునిం గాంచెన్.

55


ఆ.

కనినయప్పు డచటఁ గడునుగ్ర మగురక్త, వృష్టి గురిసె నుల్క లష్టదిశలఁ
బడియె వఱళు లఱచెఁ బిడుగు లుర్విని బడి, మ్రోసె గాడ్పు సుడిసె మాసె నినుఁడు.

56


క.

మునివరుఁడు వికటుఁ డగుతన, తనయుకడకు వచ్చి వదనదశకంబు గనుం
గొని వానికి దశవదనుం, డనియెడునామం బొనర్చె నాసుతు పిదపన్.

57


సీ.

అధికప్రమాణసర్వాంగఘోరాకారుఁ గుంభకర్ణుం డనుకొడుకుఁ గాంచె
దంష్ట్రాపరస్పరతాడనరచితసంకుల శూర్పణఖ యనుగకూఁతుఁ గనియె
నిట్టిసంతతిఁ గన్న యిమ్మహాపాతకంబునకుఁ బ్రాయశ్చిత్త మనఁగఁ బ్రీతిఁ
బడ విభీషణుఁ బావనోజ్జ్వలమూర్తిఁ గైకసి మునికృపాగౌరవమున


ఆ.

నిట్లు పుట్టి పెరుఁగునెడఁ బంక్తిముఖకుంభ, కర్ణు లెందుఁ గ్రూరకర్ము లగుచుఁ
దిరిగి జంతువుల వధింతురు ధర్మసం, ప్రీతిఁ బరఁగు నవ్విభీషణుండు.

58


ఆ.

అంత నొక్కనాఁ డనంతవైభవముతో, ధనదుఁ డేగుదెంచి తండ్రిపాల
గారవమున నున్నఁ గైకసి గనుఁగొని, చిన్నవోయి కొడుకుఁ జేరఁ బిలిచి.

59


క.

ఇతనిమహాసంపద సూచితె మీ రొక్కనిక పుట్టి శ్రీతేజములం
దితఁ డి ట్లుండఁగ నీ వి, ట్లతిహీనత నున్నఁ బురుషుఁ డండ్రే నిన్నున్.

60


మ.

తను ని ట్లాడినతల్లిమాటలకు మాత్సర్యంబు చిత్తంబునం
దనరంగా దశకంధరుం డనియె నుత్సాహంబు వాటించి యీ
తనితో సాటి యనంగ మే లన నమందశ్రీవిలాసంబు సే
కొని యీలోకము లెల్ల నేలుదును నీకుం జింత యింతేటికిన్.

61