పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

రాముఁ డిట్టు లడుగ నాముని సెప్పెఁ బా, తాళ భువనమున ముదం బడంగి
యున్న యాసుమాలి యొకనాఁడు సౌందర్య, వినయమహిత తనదుతనయఁ జూచి.

40


ఉ.

రూపగుణంబులందు ననురూపత గల్గువరుండు దీనికిం
జేపడు నొక్కొ పుత్త్రులఁ బ్రసిద్ధులఁ బల్వురఁ గాంచు నొక్కొ ల
క్ష్మీపరిణామహృద్య మగు జీవన మక్కట గల్గు నొక్కొ యి
ప్పాప మదస్వయక్రమముఁ బాత్రముఁ జేయు నొకో పొగడ్తకున్.

41


క.

ఈలోకంబున నరసితి, మే లెల్లెడ వరునిఁ గాన మేదిని కరుగం
జాలక యున్నను బోవదు, బాలికఁ గొనిపోవవలయుఁ బరిణయమునకున్.

42


మ.

అని యుల్లంబున నిశ్చయించి సుకుమారాకార నాకైకసిం
గొని వేడ్కన్ మహి నెల్లెడం దిరిగి రక్షోనాథుఁ డెం దైన న
ల్లునిఁ గల్యాణగుణోత్తరుం బడయ కెట్లుం బోవఁ బొ మ్మంచు న
ల్లనఁ జేరెం దరుపోతకాంత మగు పౌలస్త్యాశ్రమోపాంతమున్.

43


ఆ.

అచటఁ గనియెఁ దండ్రి నతిభక్తి వీడ్కొని, ఘనవిమాన మెక్కి యనుపమాన
మహిమ వెలయఁ బురికి మగుడఁ బోవఁగ ధనా, ధ్యక్షు రుచిరహారధవళవక్షు.

44


క.

కనుఁగొని సుమాలి యితనిం, గను మునిచంద్రునకు నిత్తుఁ గన్నియ నని సం
జనితకుతూహలుఁ డై య, వ్వనితకు ని ట్లనియె గారకవంపుఁబలుకులన్.

45


చ.

తగినవరుండు నీకు వనితా విను విశ్రవసుండ యాతఁ డా
ర్యగుణవిభాసి యమ్మునిజనాధిపుపాలికి నీవు వోయి యిం
పుగ వరియింపు నీకనిన పుత్త్రులచేత మదన్వయంబు రూ
పగు నిదె చూచితే ఘనుఁ దదాత్మజు నుజ్జ్వలవైభవోన్నతున్!

46


ఉ.

నా విని తాను మున్ మనమునం దలపోయువిధంబ తండ్రి సం
భావనఁ జెప్పినన్ వికచపద్మవిలోచన సంతసిల్లి యేఁ
బోవుట యుక్త మేని మునిపుంగవు నాశ్రమ మెద్ది పోదునే
నావుడుఁ జూపి సమ్మదమునన్ సుత వీడ్కోలిపెన్ సుమాలియున్.

47


క.

చని కైకసి పౌలస్త్యుం, గని వినయవిలాసభయవికాసవ్రీడా
జనితవికారసుభగనిజ, తనులత వెడవ్రాలఁ జతురతం బ్రణమిల్లెన్.

48


ఆ.

మ్రొక్కి నిలిచి యతనిముందట మేదిని, నుంగుటమున నొరయుచున్నఁ జూచి
యెచటనుండి రాక యెవ్వనిసుత వేమి, పనికి నిందు వచ్చి తనిన నదియు.

49


ఉ.

ఏను సుమాలికూఁతుర మునీశ్వర మి మ్మిటఁ దండ్రిపంపునం
గానఁగ రాక యంచు నునుఁగాంతి దలిర్చెడిమోము వాంచుచుం
దా నటఁ జెప్పలేమి విదితంబుగఁ జెప్పుట యైన నంకుర
శ్రీనినుపారె విశ్రవసుచిత్తలతం గరుణాస్వరూప మై.

50