పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

మూర్ఛవోక నిలిచి మూఁడుమొగంబుల, శూల మెత్తికొని కరాళవృత్తి
నడచి నెమ్మొగమునఁ బొడిచె నింద్రానుజు, దేవతలమనంబు దిగ్గనంగ.

30


క.

పొడిచి పిఱిఁదిదెసకయి పో, యెడిదానవు వ్రేసె గద మహీధరుఁడు గడున్
వడిఁ బక్షంబులఁ బొరిఁబొరి, నడిచెను విహగాధిపతియు నత్యుగ్రముగాన్.

31


సీ.

గద దాఁకి మూర్ఛిల్లి గరుడునియెఱకలగాలిచే దవ్వుగఁ దూలిపోయి
తెప్పిఱి లేచి నల్ దిక్కులు గనుఁగొని పాఱియుఁ జచ్చియు బయలుపడ్డ
బలములోపలఁ జేయఁగలవారి బంధుల దొరలను గానక బరవసంబు
దక్కి తమ్ముండును దాను నొండొరువులఁ జూచుచున్నంతనె వీచె గరుడి


ఆ.

పక్షమారుతమునఁ బరిపరి యైనయా, సేనతోడఁ గూడి దానవేంద్రుఁ
డాకులముగఁ జొరువుటాకులచాడ్పునఁ, ద్రిప్పికొనుచు నెగసి తెరలి పఱవ.

32


క.

అమ్మెయిని నోడి తానుం, దమ్ముఁడు హతశేష మైనదానవబలముం
గ్రమ్మఱి తమవచ్చినమా, ర్గమునఁ బాఱెను విహంగగమనుం డెగపన్.

33


మ.

కడువేగంబున లంక కేగి తమదోర్గర్వంబు దైత్యారిచేఁ
బడి భంగంబునఁ బొందినన్ భయభరభ్రాంతాత్ము లై యందునుం
దడయన్ బెగ్గిలి బృంద మెల్లఁ గొని పాతాళంబుక్రిందం జొరం
బడి రా దేవమునీంద్రకోటికి ననల్పప్రీతి సంధిల్లఁగాన్.

34

అగస్త్యుఁడు రామునకు రావణాదులకథ దెల్పుట

క.

వనజాక్షుఁ డొకఁడు వెలిగా, దనుజుల నెవ్వరికి గెలువఁ దలఁపఁగ నగు నిం
ద్రుని కప్పుడు తమ్ముఁడ వై, తనయుఁడ వై తిపుడు నీవు దశరథపతికిన్.

35


ఉ.

సత్త్వరజస్తమోగుణవశస్థితిఁ గైకొని నీవ లీల బ్ర
హ్మత్త్వము దాల్చి లోకముల కన్నిటికిన్ జననం బొనర్తు వి
ష్ణుత్త్వము దాల్చి వానికి మనోజ్ఞతమస్థితి వృత్తిఁ జేర్తు రు
ద్రత్త్వము దాల్చి వాని కుచితంబుగ సంహృతిఁ గూర్తు రాఘవా.

36


ఉ.

సాధులఁ గావ దుష్టజనసంహరణం బొనరింప ధర్మముల్
బాధలఁ బొందకుండఁ బరిపాలన సేయఁదలంచి యాత్మమా
యాధృతిఁ బుట్టువుం బనుల నాదర మొప్పఁగఁ దాల్చి పొల్చుటన్
మాధవ మర్త్యుఁ డండ్రు నిను మందమతిన్ భవభావరూఢు లై.

37


తే.

అధిపతి సాలకటంకటు లనఁగఁ జనిన, నాఁటివారుఁ బౌలస్త్యులు నాఁగఁ బరఁగు
నేఁటివారు సమానులు నిక్క మరయ, బాహుబలమున నాహవదోహలమున.

38


మ.

అనినన్ రాఘవకుంజరుండు మునినాథాగ్రేసరుం జూచి యి
ట్లనియెన్ మాల్యవదాదివృత్తము ప్రసంగాధీన మై పుట్టె నే
మును మీచే విను రావణాదులకథల్ ముట్టం బ్రశంసింపుఁ డా
తనిఁ దత్సోదరులం దనూజు వినఁ జిత్తం బుత్సుకం బయ్యెడిన్.

39