పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అరదములు రథికవరులును, హరిసారథికేతుసహిత మై పొడిపొడి గాఁ
గరులును జోదులు డొల్లఁగఁ, దురగంబులు రావుతులును దుత్తునియలు గాన్.

19


క.

ఏయుచుఁ గౌమోదకిఁ గొని, వ్రేయుచు నందకమునను వివిధగతిఁ దునియల్
సేయుచు మధుమథనుఁడు దై, తేయతతిం గూల్చె నుద్ధతిం బడలుపడన్.

20


చ.

అడరిన మేఘపంక్తి విరియం బటువేగమహానిలంబు బ
ల్విడి భయదప్రకారముగ వీచుతెఱంగున దైత్యసైన్యముల్
సెడి నలుదిక్కులం బఱవఁజేసి యమందవిజృంభణంబునం
బిడుగులపిండు బి ట్టులియుపెల్లున విష్ణుఁడు శంఖ మొత్తినన్.

21


ఆ.

పాఱలేక చాలుకపడ డొల్లె భటకోటి, కరులు గిరులు గూలుకరణి మ్రొగ్గె
ఘోటకంబు లెల్ల గుండియ లవిసి శో, ణితముఁ గ్రక్కె శంఖనిస్వనమున.

22


చ.

తదవసరంబునం బెలుచఁ దాఁకి సుమాలి యుపేంద్రుపైఁ బటు
ప్రదరము లభ్ర మద్రిశిఖరంబును వారిని ముంచినట్లు పె
ల్లిదముగ నేసె దైత్యులు చలించక సంగరకాంక్షఁ గ్రమ్మఱం
బొదువ సహోదరు ల్ప్రమదపూరిత చిత్తులు గా నుదగ్రుఁ డై.

23


క.

వనజాక్షుఁడు దరహాసం, బునఁ బొదివిన కినుక వక్త్రమున ముసుఁగు వడం
దునిమెను లీలమెయిన్ గ్ర, క్కున నాతనిసూతుశిరముఁ గ్రూరాస్త్రమునన్.

24


ఉ.

సారథి పద్ద నశ్వములు సంచలతం బెనఁగాడి యీడ్చినం
దే రనువేది యగ్రజుఁడు ద్రిప్పికొనం గని మాలి యడ్డ మై
బోరన వచ్చి యవ్విహగపుంగవకేతను నేసె నెంతయుం
గ్రూరము లైనయమ్ములను గుర్వుగ దానవు లుత్సహింపఁగన్.

25


ఉ.

మాలిశరంబు లొక్కమొగి మంచుక గప్పినమాడ్కిఁ గప్పుడుం
గూలఁగ నేసె వానిరథఘోటములన్ హరి వాఁడు గ్రక్కున
న్శైలతటంబు డిగ్గుమృగనాథుక్రియన్ గద పుచ్చికొంచు నా
భీలగతిన్ రథంబు డిగి భీమజవంబున నంట నార్చుచున్.

26


క.

పఱతెంచి కదియఁబడి యే, డ్తెఱ వ్రేసిన మోము దాఁకి తిరిగె గరుడి య
త్తఱిఁ జక్రంబున హరి పెడ, మఱి వైచెను దనుజుననుజుమస్తకము దెగన్.

27

మాల్యవంతుఁడు విష్ణువున కోడి పాతాళముఁ జొచ్చుట

శా.

మాలిం జంపిన మాల్యవంతుఁ డుదితామర్షప్రకర్షంబురం
గాలాగ్నిప్రతిమానుఁ డై నిజభుజాగర్వంబు మై లీల నున్
మీలజ్జ్వాలకరాళశక్తిఁ గొని మే మే తాఁకి వక్షస్స్థలిం
గీలించెం జలదంబుపై మెఱుఁగుమాడ్కిన్ శౌరికిం జెన్నుగాన్.

28


క.

ఆశక్తియె కొని క్రమ్మఱఁ, గేశవుఁ డసురేంద్రు వైవ గిరిపైఁ బడుతీ
వ్రాశనిచాడ్పున వక్షో, దేశంబునఁ బడిన నొచ్చి ధృతి వాటించెన్.

29