పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

తృతీయాశ్వాసము



రమ్యతానిరూఢమ
హోరస్కుం బుణ్యసంపదుదితయశస్కుం
గారుణ్యార్ద్రమనస్కుఁ బ్ర
జారంజనశీలు మనుమజగతీపాలున్.

1

విష్ణువు దేవతలకుఁ దోడై రాక్షసులతో యుద్ధము సేయుట

చ.

హరిఁ గని దేవదూత చరణారనతుఁ డై యసురేంద్రసేన ని
ర్జరనగరంబుపైఁ బెలుచురాకయు నాకము బెగ్గలంబునం
దిరుగుడుపాటుఁ జెప్పిన నతత్వరితంబునఁ గౌతుకంబు మై
గరుడుని నెక్కి శార్ఙ్గగుణగాఢరవంబు నభంబు నిండఁగాన్.

2


క.

రక్షోవధయును సుమనో, రక్షయు మదిఁ గోరి యాదరంబున రాజీ
వాక్షుఁడు సిద్ధులజయశ, బ్దాక్షరములుఁ గిన్నరీచయము గానంబున్.

3


క.

కొంచెపునగవుల సంభా, వించుచు వివిధాయుధాంశువితతుల్ దిశలన్
నించుచు దనుజతమముఁ దూ, లించుచు రణకేళిలోలలీలం జనుచోన్.

4


క.

గరుడునిపై శార్ఙ్గధను, ర్ధరుఁ డగువిష్ణుండు మేరుతటిఁ బొల్చుతటి
త్పరివృతజలదముఁ బోలుట, విరియ దనుజరాజహంసవితతి యితనికిన్.

5


మ.

అని బృందారకవందిబృందము లమందానందముం బొంది కీ
ర్తన సేయం ద్రిదివంబు ముట్టికొన నుద్దామప్రతాపంబున
న్దనుజానీకము చేరకుండ నడుమ న్వారింపఁగాఁ బూని చ
య్యన నేగెం బతగేంద్రపక్షపవనవ్యాధూతదిగ్భిత్తి యై.

6


మ.

చని నాకంబున కడ్డపడ్డ హరియుత్సాహంబు వీక్షించి య
ద్దనుజాధీశుఁడు చేయి వీచుటయు మాద్యద్దంతివర్గఁబు న
శ్వనికాయంబుఁ బదాతిలోకము రథవ్రాతంబు నొక్కుమ్మడిన్
ఘనమార్గం బఖిలంబు గప్పి పడగల్ గ్రాలన్ వడిం దాఁకినన్.

7


తే.

మందహాసంబు చేసి యమందరవము, మిగిలి రిపుతూర్యరవములు మ్రేఁగికొనఁగఁ