పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనుడు వినీతిమై భరతుఁ డారఘునందనుతోడ నల్ల ని
ట్లనుఁ గరుణావిధేయమతి యై పొగడొందిననీకు విశ్వభూ
జనమనుజేశ్వరప్రకరసంక్షయమూలము నాఁ బ్రసిద్ధి కె
క్కినక్రతు వేల యెండొకటికిం దొడఁగ మముఁ బంపు పెంపునన్.

100


ఆ.

అనినపలుకు లియ్యకొను రాఘవునకు సౌ, మిత్రి యిట్టు లనియె సత్రసమితి
యందు ముఖ్య మగుట నశ్వమేధంబు పూ, జ్యంబు దానిఁ జేయు మధిప నీవు.

101

రాముఁ డశ్వమేధయాగము సేయుట

మ.

అనినం దమ్మునిమాటఁ గైకొని మహీశాగ్రేసరుం డాతనిం
బనిచెన్ రాజుల విప్రకోటి మునులన్ బంధువ్రజంబుం గరం
బనురాగంబునఁ బిల్వఁ బంప నతఁడున్ యజ్ఞోచితామంత్రణం
బొనరించెన్ సకలావనీశజనచిత్తోల్లాససంపాది యై.

102


క.

జనపతి వసిష్ఠముఖస, న్మునులయనుజ్ఞ గొని లక్ష్మణుని ఋత్విజులం
గనకాదివస్తుయుతముగ, వెనుకం బోఁ బనిచి హయము విడిచె నియతుఁ డై.

103


తే.

పుణ్యతర మగునైమిశారణ్యభూమి, భాగమున యజ్ఞవాట మపారవిభవ
భాసితంబును శుచియుఁగాఁ జేసియున్న, నందులకుఁ జని మంత్రతంత్రాన్వితముగ.

104


క.

క్రతు వొనరింపఁ దొడఁగి భూ, పతి పత్నీకృత్యములకుఁ బసిఁడిని సీతా
ప్రతిమ నొడఁ గూర్చుకొని హృ, ద్గతఖేదము లోన నడఁచి దైర్యముపేర్మిన్.

105


క.

నానాదేశసమాగతు, లైనవివిధజనములం బ్రయత్నంబున స
మ్మానించి తత్తదుచితా, నూననిఖిలసంవిధాప్రయోజకుఁ డగుచున్.

106


క.

అన్నంబు వస్త్రములు సం, పన్నహిరణ్యంబు రుచిరబహుమణులును శ
శ్వన్నిరతి నొసఁగుఁ బ్రియమున, నన్నరపతి విప్రకోటి కచ్చెరు వారన్.

107


క.

సరసఫలకందమూలో, త్కరములు వేర్వేఱ బహులకటములుఁ దెప్పిం
చి రఘువరేణ్యుఁడు సంయమి, వరులకు నొప్పించె శిష్యవర్గము లలరన్.

108

కుశలవులు యాగశాలకు వచ్చి రామాయణగానము సేయుట

ఉ.

ప్రీతి జగంబుచిత్తములఁ బెంపు వహింపఁగ నిట్లు చెల్లఁ బ్రా
చేతసుఁ డమ్మఖంబునకు శిష్యయుతంబుగ వచ్చి దారచిం
తాతురుఁ డైన రాముని యుథార్హవిధానము శాతకుంభసీ
తాతనుసంవిధానచరితం బగు టెల్ల నెఱింగి హృష్టుఁ డై.

109


క.

సీతాతనయులఁ బ్రీతిస, మేతుం డై పిలిచి వారి కి ట్లనియె జఘ
న్యేతరుఁ డగురఘునందను, చేతోగతిఁ దెలియఁ గోరు చిత్తముతోడన్.

110


ఉ.

గేయరసంబు నింపున నకిల్బిషవర్ణములందు మాగధ
శ్రీ యలవడ్డకోవిదుల చిత్తము లార్ద్రతఁ బొందునట్లుగా