పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అవనీదేవకుమారుచావునకు నీ వత్యంతఖేదంబుఁ బొం
ది వివేకంబున ధర్మనిర్ణయము సంధిల్లం బ్రతీకారక
ర్మవిధానంబున వానిమేన మగుడం బ్రాణంబు గల్పించుటల్
దివిజవ్రాతము సెప్పఁగా విని కృతార్థీభూతచిత్తుండ నై.

87


క.

నీ కెదురుసూచుచుండితిఁ, గాకత్స్థాన్వయవరేణ్య కడునద్భుత మీ
లోకమున నిట్టిచరితం, బేకందువ నైనఁ గలదె యెవ్వరి కయినన్.

88


క.

అని యమ్మునిపతి లజ్జా, వనతుం డగు రామధరణివల్లభునకు ని
చ్చె నతి ప్రియపూర్వకముగ, ననర్ఘ్యమణిరుచుల వెలుగుఁ నాభరణంబుల్.

89


ఆ.

ఒసఁగి యిట్టు లనియె ముర్వీశ యొకదివ్య, పురుషుఁ డొక్కకొలనిపొంత నన్నుఁ
గాంచి వినయ మొప్పఁగాఁ దనదురితంబు, నాకు నెఱుఁగఁ జెప్పి నాకతమున.

90


క.

ఆదురితము వాసిన స, మ్మోదమున బ్రహ్మలోకమున కరుగునతం
డాదరవృత్తి నొసఁగం, గా దన కీభూషణములు గైకొంటిఁ దగన్.

91


తే.

దేవభరణీయ మిది నరదేవసేవ్య, నీక భరియింపఁ దగు నని నెయ్య మొంద
దేవకార్యంబు మేదినీదేవహితముఁ, గేలిమైఁ జేయు మని విభుకేలఁ దొడిగె.

92


క.

పలుకుల నాదశరథుగా, దిలిసుతుఁ దుష్టాత్ముఁ జేసి దీవనలఁ బొగ
డ్తల సముచితోపదేశం, బులఁ దాపసవరుఁడు ప్రొద్దు పుచ్చుచు నుండెన్.

93

రాముఁ డగస్త్యునిచే సమ్మానితుఁడై యయోధ్య కేతెంచుట

తే.

అధిపుఁ డాదివసంబున కయ్యామినియును, గడపి మఱునాడు మునిపద్మకమలములకు
నెఱఁగి వీడ్కొని పుష్పకం బెక్కి, సిద్ధ, సాధ్యపూజితుఁ డగుచు నయోధ్య కరిగి.

94


చ.

తనుఁ గని భక్తి మ్రొక్కుటయుఁ దమ్ములఁ గౌఁగిటఁ జేర్చి యాత్మవ
ర్తన మెఱిఁగించి తల్లులకు దండనమస్కృతు లాచరించి భృ
త్యనికరపౌరభూజనముదావహుఁ డై కొలు విచ్చి కొంతసే
పున కనుజాదిసేవకులఁ బొమ్మని భూపతి సమ్మదమునన్.

95


క.

సమయకరణీయకవిజన, సముదయగోష్ఠీవినోదసారస్యాసం
గమునఁ దగఁ బ్రొద్దు పుచ్చె, న్సముచితచతురాల్పపరిజనంబులతోడన్.

96


క.

మనుజపతి తాను దమ్ములు, జనమానసరంజనార్యసమ్మదచరితం
బున నెల్లలోకములుఁ గీ, ర్తన సేయఁగ నిట్లు పూజ్యరాజ్యము నడపెన్.

97


ఆ.

అంత నొక్కనాఁట ననుజుల రావించి, ధర్మసంగ్రహైకృతత్పరాత్ముఁ
డగుటఁ బుణ్యకర్మయత్నాదరమున వా, రలకు నిట్టు లనియె రామనృపతి.

98


చ.

క్రతువులయందు మేటి యనఁగా నుతి కెక్కిన రాజసూయ మ
ప్రతిహతవృత్తిఁ జేయునృపభావము గౌరవ మొందఁ జేఁత యీ
ప్సిత మిది మీకుఁ జూడ సవిశేషసముద్యమమేనిఁ దత్త్రియా
రతమతి నుత్సహింపుఁ డభిరామముగా విభ వస్పదంబుగన్.

99