పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గొనుచు మునీశ్వరానుమతిఁ గ్రూరత కైనను నోర్చువాఁడఁ బొ
మ్మని తలపోయుచుండెఁ గృపయం దెడ సేయుచుఁ జిన్నవోవుచున్.

76


క.

కరుణాతిశయంబుఁ బ్రజా, పరిపాలనరతియుఁ బెసఁగు వడి యుల్లములోఁ
బిరిగొన నిశ్చయమునకుం, జొరఁజాలక తలఁకు పాలసుండునుబోలెన్.

77


క.

వెడఁగుపడి యచటఁ బెద్దయు, వడి నిలిచి తలంచుకొని యవశ్యంబును ని
ప్పు డితనిఁ దెగఁజూడక చొప్పడునే యావిప్రశిశువుప్రాణం బనుచున్.

78


క.

తల కంటగించుచుండఁగ, బలిమిని నౌషధరసంబు పానము సేయం
దలకొనురోగార్తునిక్రియ, నలమటతో బెరయు తెగువ నలుగుల పడుచున్.

79


మ.

నరనాథుం డిటు లెట్టకేలకు విలీనం బైనచిత్తంబు సు
స్థిరభావంబునఁ బట్టుకొల్పికొని నిశ్చింతాత్ము నత్తాపసున్
శరణార్థిస్ఫుటరక్ష గోరి తునిమెన్ సంరంభశూన్యాంగుఁ డై
కరవాలంబు మృదుక్రియం బెఱికి రేఖాహీనదీనస్థితిన్.

80


ఆ.

అపుడు కుసుమవర్ష మాకసం బెల్లను, బోదివె దేవదుందుభులు సెలంగె
హరిహరాదిదివిజు లంతరిక్షంబున, నిలిచి సంస్తుతించి రెలమి మిగుల.

81

శూద్రమునిని వధించినరాముని దేవతలు ప్రత్యక్షమై గారవించుట

ఉ.

వారలు రాముతోడ రఘువంశనృపోత్తమ యిత్తపోధనుం
డేరికిఁ బొందరానిగతి కేగె సుకర్మము మెచ్చి యేము నీ
కోరినయట్ల యిచ్చెదము కొమ్ము వరం బనినం బ్రమోద మే
పారఁగ విప్రబాలుబ్రదు కాధరణీరమణుండు వేఁడినన్.

82


క.

ఏప్రొద్దు శూద్రముని విగ, తప్రాణునిఁ జేసి తీవు ధర్మనిరతి నా
విప్రశిశువుచైతన్యము, నాప్రొద్ద యనూనముగ సమాహిత మయ్యెన్.

83


చ.

అని విభునెమ్మనంబు ప్రమదాతిశయంబును బొందఁజేసి య
య్యనిమిషసంఘ మి ట్లనియె నాతనితో మఱియు మహీశ యే
మనఘుఁడు కుంభసంభవునియజ్ఞముతీఱుదలం దదీయద
ర్శనమున కర్థి నేగెదము ర మ్మట నీవుఁ దగం దదర్థమై.

84

దేవతలు చెప్పినచొప్పున నగస్త్యునియజ్ఞము చూడ రాముఁ డరుగుట

చ.

అనుచు విమానముల్ నడప నన్నరనాథుఁడు పుష్పకంబుపై
ననుగమనంబు సేసె నమృతాశనులుం జని యమ్మునీంద్రుపూ
జనములఁ దృప్తిఁ బొంది రఘుసత్తము ధర్మవిధిప్రయత్న మా
తని కెఱిఁగించి యేగి రుచితంబుగ సంయమిఁ గాంచె రాముఁడున్.

85


క.

అతఁ డభ్యాగతపూజా, ప్రతిపాదనకౌశలమును రాఘవు సంతో
షితహృదయుఁ జేసి యిట్లనుఁ, గతిపయసల్లాపజనితకౌతూహలుఁ డై.

86