పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

మఱునాఁ డమ్మునినాథు వీడ్కొని జగన్మాన్యత్వవిఖ్యాతికిన్
గుఱి యై యుండెడిగంగ దాఁటి మదిఁ గోర్కుల్ ప్రోవుగా వీడు డ
గ్గఱఁ బోఁబోవఁగఁ జూడ్కి యారఘువరాగారంబుపై వేడుకం
బఱచెం గ్రమ్మెడుసమ్మదాశ్రువులతోఁ బల్మాఱుఁ ద్రోపాడుచున్.

45


ఆ.

ఇట్టు లరిగి మేదినీశ్వరుఁ గని తత్ప, దాంబుజంబు లుత్తమాంగమునకు
భూషణముగ మేను పులకలప్రోవుగాః, బ్రణతుఁ డయ్యె నానృపాలసుతుఁడు.

46


చ.

తిగిచి కవుంగిలించి నరదేవకులోత్తముఁ డక్కుమారు నె
మ్మొగము మొగంబునం గదియ మోపుఁ గరాంగుళులం గపోల మిం
పుగఁ బుడుకుం బొరిం బొరి నపూర్వవిలోకన మాచరించుఁ గ
ప్పగుమృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్.

47


చ.

తనుఁ గొనియాడునాతనికిఁ దమ్ముఁడు గేలు మొగిడ్చి యల్ల ని
ట్లను భవదాజ్ఞ మోచి చని యద్దనుజాధము సంగరాంగణం
బున వధియించి విప్రుల కపూర్వమహోత్సవ మాచరించి వా
రనికృప వారు పంప మధురాపురి రాజ్యము సేయుచుండితిన్.

48


క.

మిముఁ గొలుచుసుఖమునకు రా, జ్యము సౌఖ్యం బీడు గామి నం దునికికిఁ జి
త్తము గొలుపక నావచ్చుట, సముచిత మనుచితము నాక చననిండు దయన్.

49


ఉ.

నావుడు నల్ల నవ్వి నరనాథుల కి ట్లనఁ జెల్లు నయ్య య
చ్చో వసియించిన సరిగఁ జుట్టముఁ బాసియు నిల్వఁ జాలి నా
నావిధదేహదుగఖము మనంబున నోర్చినఁ గాక రాజ్యల
క్ష్మీవిభవంబు సొప్పడునె కేవలమే నృపతిత్వ మారయన్.

50


క.

అని బోధించి మగుడ నే, డెనిమిది దివసములలో నరేశ్వరుఁ డటఁ బోఁ
బనిచిన నాతఁడుఁ బ్రీతిం, జని మధురాపురము రాజ్యసంపదఁ బొందెన్.

51


క.

భూనాథుఁ డిట్లు దమ్ములుఁ, దానును వివిధప్రకారధర్మనిరతు లై
నానావిధసజ్జనస, మ్మానసదాదాననిపుణుమతి నున్నయెడన్.

52

ఒకానొకబ్రాహ్మణుఁడు చచ్చినకొడుకుం దెచ్చి రామునినగరివాకిటఁ బెట్టి దుఃఖించుట

ఉ.

చచ్చినపుత్రు నెత్తుకొని జానపదుం డొకవిప్రుఁ డార్తుఁ డై
వచ్చి నరేంద్రుమందిరము వాకిట నాలును దాను నిల్చి వా
పుచ్చి మహోష్ణబాష్పములు బోరనఁ గ్రమ్మఁగ నేడ్చి యేడ్చి క
న్విచ్చుచు మోడ్చుచుం గోడుకు వేఁడుచు నెవ్వరి నేనిఁ జూచుచున్.

53


మ.

తనయుం డొక్కఁడ కాని నాకు మఱి సంతానంబు లే దేను భా
మినియుం బిమ్మటిసత్క్రియల్ పడయ లేమిం జూడఁ డయ్యెం గటా
చనునే వీనికి నిట్లు సేయ మరణోత్సాహంబు శోకాపనో
దన మంచుం బలుమాట లాడుచుఁ బరీతాపంబు దీపింపఁగన్.

54