పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అవనీనాయకనందనోత్తముఁ డమోఘాస్త్రంబు సంధించి క
ర్ణవతంసప్రభ లంగుళీయకముపైఁ బ్రాఁకంగ నాకర్షణం
బవగాఢంబుగఁ జేసి తైజసముతో నాలక్షితోరస్కుఁ డై
లవణుం గూలఁగ నేసె రౌద్రరసలీలాస్ఫూర్తి శోభిల్లఁగాన్.

31


ఆ.

అసురపాటు చూచి వసుమతీసురులు దీ, వనలు మున్ను గాఁగ వచ్చి యక్కు
మారుఁ బొదివి సంభ్రమంబును హర్షంబు, నెసక మెసఁగ నతని కిట్టు లనిరి.

32


శా.

ఈతం డప్రతిమానబాహుబలుఁ డై యేపారి మీతాత మాం
ధాతం దొల్లి వధించె నాపగ భవద్వంశంబునం దెవ్వరున్
వే తీర్పంగఁ దలంప రైరి త్రిజగద్విఖ్యాతిగా నిఫ్డు నీ
చేతం జచ్చెఁ గులంబుఁ దేజముఁ బ్రతిష్ఠింపంగఁ దా నల్పమే.

33


క.

అనుచుండ నాకసంబున, ననిమిషు లేతెంచి రఘువరానుజ నీ చే
సినలోకహితపరాక్రమ, మున కెద మెచ్చితిమి వేఁడుము వరం బనినన్.

34


తే.

నన్ను మధురాపురం బేల నన్న పనిచె, రాష్ట్రమునకు వృద్ధియుఁ బ్రజారంజనంబు
వినుతసద్వర్తనము మఱి విప్రభక్తి, నాకు దయసేయుఁ డనియె నన్నరవరుండు.

35


క.

వా రమ్మాటకు మెచ్చుచు, గౌరవ మెసఁగంగ నట్ల కావుత మని మం
దారప్రసూనవర్షము, బోరనఁ గురియించి దివికిఁ బోయిరి ప్రీతిన్.

36

లవణు వధించి మధుర నేలుచున్న శత్రుఘ్నుఁడు పండ్రెండేండ్లకు నన్నం జూడవచ్చుట

తే.

ఇవ్విధంబున నద్దానవేంద్రుఁ జంపి, మునులచిత్తంబు దేవసమూహకృపయుఁ
బడసి మధురాపురం బేలెఁ బరమధర్మ, నిరతుఁ డై ప్రజ రాగిల్ల నృపవరుండు.

37


క.

ఆదిమహీపతులక్రియన్, వేదోచితనిఖిలమార్గవేదితముగ ని
త్యోదయమహనీయుం డై, ద్వాదశవర్షముల కన్నవలనితలఁపునన్.

38


క.

కతిపయపరివారముతో, నతఁ డేగెడునెడఁ బ్రమోద మడర నరిగె నం
చితధర్మకర్మనిత్యో, దృత మగువాల్మీకిమునివరాశ్రమమునకున్.

39


క.

అం దభ్యాగతపూజా, నందితుఁ డై యానరేంద్రనందనుఁ డమృత
స్యందముచందం బగు ముని, బృందారకుచూడ్కి యెడఁదఁ బ్రీతి యొనర్పన్.

40


క.

అతఁడు దను లవణయుద్ధ, స్థితి యడుగఁగ నల్ల నల్లఁ జెప్పుచు సంభా
వితుఁ డగుచు గాఢలజ్జా, నతిఁ బొందుచు నుండె మునిజనంబులలోనన్.

41


క.

ఆశ్రమము నెల్లయెడలను, విశ్రుతమునిదారకులు ప్రవీణతమై మం
జుశ్రుతిమేళన మానం, దాశ్రులుఁ బులకలును దాల్చు నట్లుగఁ బాడన్.

42


తే.

అభినవాకృతి యగుకృతి యగుట జేసి, యాత్మఁ గౌతుక మంతంత కగ్గలింప
నమ్మునీశ్వరు చెప్పిన యాదికావ్య, మయినరామాయణము చెవులార వినుచు.

43


క.

సరసం బగురఘుకులపతి, చరితం బొక్కొక్కచో నిజస్వాంతఁబుం
గరఁగింపఁ దన్మయత్వముఁ, బొరయుచు నద్దినము నృపతిపుత్త్రుఁడు గడపెన్.

44