పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కావున నీదనుజాధముఁ, బోవఁగ నీ కాఁగవలయుఁ బొ మ్మని యడ్డం
బై వచ్చి మందహాసము, తో వానికి నిట్టు లనుఁ జతురవచనములన్.

19


క.

అగు నగుఁ బో నిత్తునె నా, పగ చేకుఱ నిపుడ యెన్నిభంగుల నయినం
దెగఁ జూతుఁ గాక విడుతునె, మగుడఁగదే పూఁట పెట్టి మా కిచ్చోటన్.

20


ఉ.

ఎక్కడఁ బోవవచ్చు నిదె యేచి మదీయశరాంధకార మే
దిక్కును గానకుండ దివి దీటుకొనన్ నినుఁ జుట్టుముట్టుచున్
మిక్కుట మయ్యెడున్ రణము మేకొని చేయఁగఁ బూని యియ్యెడం
జక్కనిబంట వై నిలుము చచ్చుట తప్పునె యెందుఁ బాఱినన్.

21


తే.

తొల్లి రాముబాణాహతిఁ ద్రెళ్లియున్న, దశముఖునిఁ జూచుసురలచందమున నాదు
నిశితశరములఁ గూలిననిన్ను భూమి, సురలు గన్నార నిప్పుడు చూచువారు.

22


క.

అప్పలుకులు విని కన్నుల, నిప్పులు రాలంగ నసుర నృపనందనుతోఁ
జెప్పఁ బలు కొండు గానక, యప్పటియని కియ్యకొని తదనురూపముగన్.

23

శత్రుఘ్నుఁడు ద్వంద్వయుద్ధమున లవణాసురుం జంపుట

శా.

ఆటోపంబున నొక్క టెక్కటియ శౌర్యావేశి యై నిల్చి య
చ్చోటం గల్గు తరువ్రజంబును శిలాస్తోమంబునుం బూన్చి యా
స్ఫోటక్ష్వేళనదృప్తమూర్తి యగుడున్ భూపాత్మజుండుం బటు
జ్యాటంకార మొనర్చె భూమివలయం బాకంపముం బొందఁగన్.

24


క.

ఒకమ్రాను పెఱికికొని సు, భ్రుకుటితముఖుఁ డగుచు దనుజఃపుంగవుఁడు గుమా
రకు వైవఁ బూఁచుటయు నది, శకలములుగ సేసె నిశితశరసంఘములన్.

25


చ.

నృపతనయుండు దైత్యవిభునిన్ రభసంబునఁ దీవ్రబాణజా
లపరివృతాంగుఁ జేయఁగ శిలాతతి నమ్ముల నిల్వరించి గ
ర్వపుఁబలుకుల్ వెసం బలికి వారనికోపరసంబుపేర్మి వాఁ
డుపలమహోగ్రవర్షము సముద్ధతి మైఁ గురిసెం గుమారుపై.

26


చ.

అతఁడు నిశాతసాయకము లద్దనుజుం గని తూఱ నేయఁ గో
పితుఁ డయి నింగితోఁ గదియఁ బేర్చిన యొక్కమహామహీరుహం
బతులబలంబునం బెఱికి హస్తయుగంబున నొక్కలావ కా
నతిశయలీలఁ ద్రిప్పి కదియంబడి దైత్యుఁడు బిట్టు వ్రేసినన్.

27


ఆ.

అమ్మహీరుహంబు నదరంటఁ దాఁకిన, నొచ్చి పంక్తిరథతనూభవుండు
మూర్ఛ వచ్చి యంగములు శిథిలంబులై, మిడుక లేక పుడమిమీఁదఁ బడియె.

28


క.

పఱతెంచి కరి మదము నే, డ్తెఱఁ దొండం బెత్తివేయ దెప్పఱికమునం
గొఱసంది దాఁకి నేలకు, నొఱఁగిన సింగంపుఁగొదమయొ ప్పమరంగన్.

29


క.

ఉన్న నది చావుగాఁ గొని, యన్నరభోజనుఁడు దుర్మదాంధుం డయి శౌ
ర్యోన్నతి నార్చి బ్రమరి గాఁ, జన్నయెడం తెలిసి రోషసంరంభమునన్.

30