పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నున్నయెడ భూవరుఁడు దనకన్నప్రజల, యాయురైశ్వర్యములుఁ దదనంతరంబ
వారిసంతతితెఱఁగు దుర్వాసు నడుగ, నమ్మహీపతితోడ ని ట్లనియె నతఁడు.

59


క.

నీకొడుకు అధికబలభ, ద్రాకృతులఁ బ్రవృద్ధిఁ బొంది యాయుశ్శ్రీ ల
స్తోకంబులు గాఁ బుణ్య, శ్లోకత నేలుదురు మధ్యలోకం బెల్లన్.

60


ఆ.

వెలయఁ బదునొకండువేలవత్సరములు, రాజ్యమహిమఁ బొంది శ్రీరామభద్రుఁ
డనుపమానకీర్తి యార్జించి పదపడి, బ్రహ్మలోకసుఖము బడయువాడు.

61


తే.

అన్న రాజ్యంబు సేయంగ ననుజు లెల్ల, పనులు నడపుచు నీతియు బాహుబలము
మెఱయ వర్తిల్లి యతఁ డేగుతఱియ తమకు, నవసరంబుగ సద్గతి కరుగువారు.

62


క.

చతురమతి రామునకు భూ, సుతయం దుదయంబు నొంది సుతు లిరువుకు వి
శ్రుతు లగుదు రందుఁ బూర్వజుఁ, డతులితసామ్రాజ్యమునకు నభిషిక్తుఁ డగున్.

63


క.

భరతాదు లయినమువ్వురు, నిరువుర నిరువురఁ ద్రిలోకరహితపూజ్యులఁ ద
త్పరులం బడయుదు రయ్యా, ర్గురు నొక్కొకభూమిపతు లగుదు రుజ్జ్వలు లై.

64


క.

అనియెం గావున రాముఁడు, జనకతనూజయు నసౌఖ్యచరితులు మనకున్
వనటకు నించుక యేనియుఁ, బని గా దనవుడును హృదయపద్మం బలరన్.

65


క.

అలఘురఘువంశమునకుం, దల మాటించుకయు లేమి తథ్యముగా నీ
వలన సమస్తంబును నేఁ, దెలిసితి నామనము కలఁక దీఱె మహాత్మా.

66


క.

అని సౌమిత్రి సుమంత్రుని, ఘనపరిరంభణము సేసి గౌరవమున నా
తనితో సంభాషించుచుఁ, జన నొకపుణ్యాశ్రమంబు చక్కటి యైనన్.

67


ఆ.

అచటి కరిగి మునికృతాధికపూజనం, బులఁ బథిశ్రమంబు వుచ్చి నాఁటి
రాత్రి యచటఁ గడపి రామానుజుఁడు జన, శ్లాఘ్యమూర్తి యగుచుఁ జనియెఁ బురికి.

68

లక్ష్మణుఁడు పట్టణమునకుఁ బోయి యన్నతో సీత నడవిని విడిచి వచ్చితి నని చెప్పుట

చ.

నగరి సమీప మైన నరనాథునిసన్నిధి కోహటించి నె
మ్మొగము వివర్ణతం బొరయ మోసల నల్లన తేరు డిగ్గి నె
వ్వగ దలకొన్న వ్రేఁ గడరి వ్రాలుగతిం దలవాంచి యేగె సౌ
మ్యగుణవిభాసి లక్ష్మణకుమారకుఁ డానృపుఁ డున్నచోటికిన్.

69


మ.

చని దీనాననుఁ డైనయజ్జనపతిం జక్కంగఁ దాఁ జూడ నో
పనివాఁ డయ్యును ధైర్య మూఁది విగళద్బాష్పాంబు లంతంత లో
నన యింకించుచుఁ దొట్రుపాటు చరణన్యాసంబులం జేర నీ
నినడం జేరి వినమ్రుఁ డయ్యెఁ బతికన్నీ రాఁకకున్ మీఱఁగాన్.

70


క.

నేత్రములు దుడిచికొంచు సుమిత్రాసుతుఁ బెఱకరమున మెల్లన యెత్తెన్
ధాత్రీవిభుఁడు నిషాదా, మాత్రహృదయుఁ డయ్యుఁ దా సమాహితుఁ డగుచున్.

71