పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఆతపస్వినులు ప్రియంబున జానకిఁ, బొదివి యాత్మవాసభూమి కర్థి
తోడ గారవించి తోకొని పోయిరి, మునియు నిజనివాసమునకుఁ జనియె.

49


క.

మునినాథుఁ డింతిఁ దోకొని, తనయాశ్రమమునకు నేఁగు తడ వంతయుఁ దా
నును నిలిచి యాసుమిత్రా, తనయుఁడు గనుఁగొనియె నశ్రుధారలు గవియన్.

50

పట్టణమునకుఁ బోవుచు సుమంత్రుఁడు లక్ష్మణునకు దుఃఖోపశమంబుగాఁ దొల్లిటికథ యెఱింగించుట

ఆ.

ఇవ్విధమున రాఘవేశ్వరుదేవి న, య్యడవిఁ ద్రోచి మరలి యరిగి యరిగి
యడలు గదిరి యిట్టు లనియె సుమంత్రుతో, నతఁడు మొగము దీన మగుచునుండ.

51


క.

మనయింటిచేటు సూచితె, మనుకులసత్తముఁడు తొఱఁగె మైథిలిని భూ
జనవాదంబు మహాత్ముతుల, యనఘచరిత్రమునకంటె నధికం బగుటన్.

52


సీ.

అభిషేకదినమున నడవికిఁ దపమున కరుగుము నీ వన్న నట్ల చనియె
నందును నతిశాంతుఁ డై యుండఁగాఁ దనకోమలి నఱిముఱిఁ గోలుపోయె
నమ్ముద్ధ మగుడఁ దే నని చన్నచోట ననేకవిధం బగు నిడుమఁ బడియెఁ
దెచ్చియుఁ బ్రీతిలో నొచ్చి యొడంబడి మనపుణ్య మేది యిమ్మాడ్కిఁ జేసె


తే.

నకట పుట్టిన కోలెను నంతకంత, కగ్గలించినదుఃఖంబు ననుభవించు
చున్నవాఁ డన్న యే మని యుగ్గడింతు, నీమనోగ్లాని తెగుదల యెద్ది చెపుమ.

53


చ.

అనిన సుమంత్రుఁ డి ట్లనియె నాతనిపుట్టిననాఁడ వచ్చి త
జ్జనకునితోడ భూమిసురసత్తము లెల్ల ననేకదుఃఖభా
జన మగు నల్పసౌఖ్యుఁ డగు శౌర్యము ధైర్యము దానశక్తియున్
వినయముఁ గల్గువాఁ డగును నింద్యుఁడు వీఁ డన వింటి నేర్పడన్.

54


ఆ.

పితృవియోగజనితపీడయు ననుజవి, యోగజనితపీడయును సతీవి
యోగజనితపీడయును బొందు వీని న, నంగ వింటి నేను నరవరేణ్య.

55


క.

కావున విధికృత్యము లగు, నీవృత్తాంతములు కింత యేటికి వగవం
జావును జేటును మనుజుల, కావిర్భావంబుతోన యైనవి గావే.

56


క.

మఱియు నొకమాట యెవ్వరు, నెఱుఁగనియది దశరథునకు నేకాంతమునం
దఱమఱ లేక దృఢంబుగ, నెఱుకపడం జెప్ప వింటి నే నొకరుండన్.

57


క.

అది రాముఁడు భరతుండును, మొదలుగ నెవ్వరును వినరు మున్నైనను నీ
హృదయంబుకలఁక యుడుపఁగ, మదిఁ గోరుటఁ జెప్ప వలసె మనువంశనిధీ.

58


సీ.

సర్వజ్ఞుఁ డనఁదగు దుర్వాసుఁ డనుమునీశ్వరుఁడు వసిష్ఠునాశ్రమమునందు
సాంవత్సరిక మైనసత్రంబు నడపంగ ధర్మప్రియుం డగుదశరథుండు
వేడుక జన్నంబుఁ జూడఁ బోయి మునిప్రవరు లిద్దఱకు నభివందనంబు
సేసి రహస్యగోష్ఠీవినోదంబునఁ దత్పరు లగువారుఁ దాను నచట