పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ఒకనారీతిలకంబు గాననములో నుద్దామశోకార్త యై
వికలాలోకన మశ్రుధారలును బృథ్వీరేణులిప్తాంగముం
బ్రకటాక్రందనమున్ వికీర్ణకబరీభారంబు వక్త్రబ్జశో
షకనిశ్వాసగమోష్మముం గలయవస్థం బొందఁగా నయ్యెడన్.

38


తే.

అరిగి యరిగి కనుంగొని యటఁ జనంగఁ, గాళ్లు లాడక మీ కెఱుఁగంగఁ జెప్పఁ
బాఱుతెంచితి మే మహాభాగుసతియొ, నిరుపమోదాత్తమూర్తి యన్నీరజాక్షి.

39


చ.

అనవుడు నమ్మునిప్రవరుఁ డారఘువంశవరేణ్యుదేవిఁ గాఁ
దనమహనీయబుద్ధిఁ గని ధర్మవిధిన్ మహితార్ఘ్యపాత్ర చే
కొని రభసంబునం జనియె ఘోరదశాపరిపాకతప్రతచే
తన యగుచున్ మహిం బొరలు తామరసానన యున్నచోటికిన్.

40


మ.

చని సంతర్పణవాక్యపూర్వముగ నాశ్వాసంబు గావించినన్
వనితారత్నము భక్తి నమ్మునిపదద్వంద్వంబునం దశ్రులం
గొని పాద్యం బొనరించె నాతఁడు మనక్షోభంబు సంధిల్ల ని
ట్లనియెన్ గద్గదికానిరుద్ధవచనుం డై యాసరోజాక్షికిన్.

41


క.

జనకుఁడు తండ్రియు దశరథ, జననాథుఁడు మామ యఁట విశాలయశశ్శ్రీ
ధనుఁ డగురాముఁడు పతి యఁట, వనితలతో నిన్ను నెన్నవచ్చునె సాధ్వీ.

42


క.

నీవచ్చినతెఱఁ గెడఁదను, భావించి యెఱింగి నీదుపావనచరితం
బీవెడమాటల నాఱడి, పోవుట కత్యంతచింతఁ బొందితి నబలా.

43


తే.

లోకముల నెద్ది యేనియు నాకు నెఱుఁగ, రానియట్టిది లేదు నిర్మలత నొప్పు
నీదుచరితంబు తెల్లంబు గాదె రాము, నేరమియ చూవె యింతయు నిక్క మరియ.

44


చ.

ఇదె మనయాశ్రమం బిచట నీవు వసింపు తపస్వినుల్ ప్రియం
బొదవఁగ నీకు నెల్లపనియుం బరమాదరవృత్తి నాచరిం
చెద రిదె నీగృహంబునకుఁ జేరితి గావున నీదుగర్భ మ
భ్యుదయముఁ బొందు దుర్యశము వోవుఁ బదంపడి నమ్ము మెమ్మెయిన్.

45


క.

కైకొను మర్చన మనవుడు, నాకోమలి దెలిసి యర్ఘ్య మందుకొనియె సు
శ్లోకుఁ డగునమ్మునీశ్వరు, సాకతమున శోకవహ్ని శాంతతఁ బొందన్.

46


తే.

ఇత్తెఱంగున నూరార్చి యింతిఁ దఱిమి, యల్లనల్లన తోకొని యాశ్రమమున
కరుగుదేరంగ నమ్మునీశ్వరున కర్థి, నెదురువోయి తపస్విను లెరఁగుటయును.

47


చ.

జనకునికూఁతు రార్యగుణశాలిని రామునిదేవి సీత యా
తనికొఱగామి నియ్యెడకుఁ దాపసవృత్తిఁ జరింప వచ్చె ని
వ్వనితకు నెల్లకృత్యము దివానిశముం బరికించి బాంధవం
బు నెఱయఁ జేయుఁడీ యని తపోధనసత్తముఁ డప్పగించినన్.

48