పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పతియ చుట్టంబుఁ బక్కంబుఁ బతియ చెలియుఁ
బతియ తల్లియుఁ దండ్రియుఁ బతియ గురుఁడు
పతియ దైవంబుఁ గావున నతనిపం పొ
నర్చుటయ కాదె ధర్మంబు నాతి కరయ.

29


ఉ.

మేనికి నంతవంతఁ బడ మిక్కిలి కాఱియఁ బెట్టి నొంపఁగాఁ
బూనితి నోర్వ కున్న నది వోవునె యట్లు జగంబువారలున్
మానము లేక యీ తులువమాటలు నాదెస నాడ దుస్సహం
బైనది దీని మానుపునుపాయము చొప్పడ దేమి నేయుదున్.

30


మ.

అనుచుండ మఱుమాట వల్కక సముద్యద్భాష్పుఁ డై లక్ష్మణుం
డినవంశాగ్రణిదేవిపాదయుగళం బీక్షించి ధాత్రీతలం
బును ఫాలంబునఁ బొంద మ్రొక్కి వినయంబుం దీవ్రశోకంబు నె
మ్మనముం జుట్టుకొనం బ్రదక్షిణముగా మందప్రచారంబునన్.

31


క.

పడి నంటఁ దాఁకు బలితపు, టడలున రూపఱినమనమునం దోరిమి పాఁ
తెడలి వెసఁ బురికిఁ బోఁ దెగు, వడరిన వావిడిచి దిక్కు లద్రువ నఱచుచున్.

32

లక్ష్మణుఁడు సీతను గంగ దాఁటించి పురమునకు మరలుట

చ.

అరిగి మరుత్తరంగిణియుపాంతము డాయుచు రోదనంబుతో
బెరయఁ గిరాతు దీనమతిఁ బిల్చి తదాహితయానపాత్ర మా
తురగతి నెక్కి యద్దరికి ధూతకళంకుఁడు వోయె మేదినిం
బొరలుచు నోడది క్కరయు భూతనయం బలుమాఱుఁ జూచుచున్.

33


క.

చని యరద మెక్కి యల్ల, ల్లన పోవుచు నిలిచి నిలిచి లక్ష్మణుఁ డయ్యం
గనఁ బొరిఁ బొరి మరలి కనుం, గొనుచుండఁగఁ గోమలియును గొందలపడుచున్.

34


సీ.

ము న్నాతెఱంగుననున్నట్టియే నిప్పు డిమ్మెయి వనమున కెట్లు వోదు
నిది యేమి యొంటిమై నేతెంచి తనిన నెప్పాట నే మఱుమాట పలుక నేర్తు
నెవ్వరితోడ నే నేమని యీ దురవస్థ మాటికిఁ జెప్పి వనరుదానఁ
బతి యిల్లు వాపిన కతము న న్నడిగిన నేను ద ప్పేదిగా నేర్పరింతు


ఆ.

మునిసతీజనంబు ముందటఁ గొంకక, యెవ్విధమున మెలఁగి యిచట నిలిచి
కాల మెట్టిభంగిఁ గడపుడు నే నని, యడలి యేడ్చుచున్న యవసరమున.

35

వాల్మీకి సీతవృత్తాంతము మునిపుత్రులవలన విని వచ్చి తనయాశ్రమమునకుఁ దోడ్కొనిపోవుట

క.

మునిపుత్రకు లేటికిఁ జని, చని యయ్యెలుఁగునకుఁ జేరి చంద్రాస్యఁ గనుం
గోని యటఁ బోవక యరిగిరి, మనములఁ గృప గదుర నాశ్రమమునకు మరలన్.

36


ఆ.

సరభసముగ నేగి సంయమిచరణారవిందములకు నధికవినయ మెసఁగ
మ్రొక్కి మోడ్పుఁ గేలు ముందట నిగిడించి, యిష్ట మెఱుఁగ నతని కిట్టు లనిరి.

37