Jump to content

పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పడి మూర్ఛిల్లి మగుడ నొక, వడికిం దెలివొంది బాష్పవారి గనుఁగవం
గడలుకొనుచుండ వాతెఱఁ, దడుపుచు వెలవెల్ల నగుచుఁ దల్లడపడుచున్.

18


క.

పలు కుడిగి పెద్దప్రొ ద్దా, కులదృష్టి మఱందిఁ జూచుఁ గొండొకనవ్వుం
దలయూఁచు ముక్కుపైనం, గుళమిడు వెఱఁగందు వగలకుం గొలువిచ్చున్.

19


ఆ.

సందియంబు పడ విచారంబునకుఁ జొర, మాఱు పలుక నొండుమాడ్కి సేయ
వెరవు గాక పిడుగువేసినయ ట్లైన, మాట కియ్యకొనుచు బోటి పలుకు.

20


క.

అగుఁ గాక యట్లు చేసెద, జగతీపతిపనుపు సేసి చను నీవును నీ
తెగువ రఘుపతికి నీకుం, దగ వఁట యే ననెడి దేమి తమ్ముఁడ చెపుమా.

21


సీ.

అఖిలధర్మస్థితి నపచారి యందునే యావనంబునఁ దప మాచరించెఁ
గరుణాసముద్రుఁడుఁ గాఁడందునే యట్టి యపరాధిఁ గృతకవాయసముఁ గాచె
నాశ్రితరక్షమై నర్థి లేఁ డందునే పగతుతమ్ముని రాజ్యపదవి నిల్పెఁ
బాటించి నన్ను సంభావింపఁ డందునే నాకుఁ గా నెన్ని యత్నములొ చేసెఁ


తే.

బతి జనించినకోలెను బరహితైక, లోలమతి యొడల్ సిదిమినఁ బాలు వచ్చు
నాతఁ డిది కార్య మని నిశ్చయంబుచేత, నాయభాగ్యంబ యొండొకవేయు నేల.

22


క.

ఇడుమలు గుడువఁగ బుట్టిన, యెడ లిది యిటు లోపుఁ గాక యొడ్డులు నాచేఁ
బడిరి తొలుభవమునం ది, ప్పుడు తత్ఫల మందకున్నఁ బోవునె నాకున్.

23


ఉ.

ఉల్లము పొక్కు నెవ్వగల కోటఱి యే మరణంబు గోరినం
జెల్లదె జాహ్నవీసలిలసేచన మూర్ధ్వగతిప్రదంబు సం
ఫుల్లయశోభిరామ మగు భూపతివంశము నిల్చునంతలో
నొల్ల దురంతదుఃఖముల కోర్చుట మేలు దలంచి చూడఁగన్.

24


చ.

అతులితపుణ్యమూర్తు లగునత్తల కెల్లను నేను భక్తి మ్రొ
క్కితి నెఱిఁగింపు సూర్యకులకేతువు నా విలసిల్లురాముసం
తతి భరియించి యున్న యది దానికి శోభన మందఁ గచ్ఛప
స్థితి నయినం దలంపు దయసేయుఁడు మీ కని యప్పగింపుమీ.

25


క.

జనపతికి నింక నే నే, మని చెప్పిన నేమి యగును నది గడచన నై
నను నూసువోక వెండియు, ననియెద నొకమాట రఘువరానుజ నీతోన్.

26


చ.

తనమది నొక్కయుమలిక దక్కిన మంచిది దానిఁ బాపఁగా
నని తలపోసి చేయుపని కక్కట యేనును లోను గానె నా
కు నెఱుఁగఁ జెప్పి పొ మ్మనుటకు దగనే మొగమాట లేక మ
న్ననయెడ నైన రాజుల మనంబులు ద్రిప్పఁగ బల్మి గల్గునే.

27


క.

కానిమ్ము నాకుఁ జెప్పినఁ, గానియ కా దధిపుపనుపు గడతేర్పఁగ నేఁ
బూనినపని యిది నీవును, బూని యొనర్చు టది యెల్లఁ బొచ్చెమె చెపుమా.

28