పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

సంతస మందుచున్న రఘుసత్తముదేవికి లోకవాదవృ
త్తాంతము నన్న దన్ బిలిచి యన్నతెఱంగును దత్తపోవనో
ప్రాంతము గావునం దెలియఁబల్కఁ దలంచుచు నల్లఁ జేరి య
త్యంతవిషాది యై రఘువరానుజుఁ డాత్మ చలించుచుండఁగన్.

9


శా.

నా కింక మరణంబ కార్య మిటు లన్యాయప్రవృత్తాత్ముఁ డై
కాకుత్స్థాన్వయదీపకుండు నను లోకత్యాజ్యుఁ గావించె నం
చాకాంతాతిలకంబుపాదముల పర్యంతంబుగాఁ బుణ్యగ
ణ్యాకారుం డిలఁ జాఁగి మ్రొక్కిన మనం బాకంపముం బొందఁగాన్.

10


ఉ.

కారణ మేమి నన్ను దశకంఠకులాంతకుఁ డెగ్గు వల్కెనో
నేరమి గల్గెనో యకట నిక్కము నా కెఱిఁగింపు మిట్టిదు
ర్వారమనోవ్యథం బొరయువాఁడవు గావు వివేకవిశ్రుతా
చారుఁడ వైననీ వని విశాలవిలోచన గారవించినన్.

11


ఉ.

ఇత్తెఱఁ గాచరించుటకు నే నిది యేటికి నియ్యకొంటి నీ
యుత్తమురాలి నోఁ బలుక నోపఁగ వచ్చునె యంచు వెండియుం
జిత్తము గూడఁ దెచ్చుకొని చెప్పక పో దని నిర్ణయించి డ
గ్గుత్తిక వెట్టి లక్ష్మణుఁడు కోమలిఁ జూచుచు నశ్రు లొల్కఁగాన్.

12

రాముఁడు లోకాపవాదభీతుఁ డై విడనాడినవృత్తాంతము సీతకు లక్ష్మణుఁ డెఱిఁగించుట

శా.

ఏ నిం కేమని చెప్పుదు రఘుకులాధీశున్ జగం బెల్ల నీ
కై నింది౦పఁగఁ జాల నొచ్చి యది మిథ్యావాద మైనన్ సమా
ధానం బేర్పడఁ జేయ కున్న నిజవృత్తం బెంతయున్ దూషితం
బై నీచత్వము రాక తక్కదని యూహాపోహసంవేది యై.

13


క.

పురజనుల భూజనంబుల, పరివారం బొండుభంగి బాయమి జీవ
స్మరణం బగుచున్న భవ, ద్విరహంబున కియ్యకొనియె విభుఁ డధికధృతిన్.

14


ఉ.

ఏకత ముండినన్ బిలిచి యేర్పడ నింతయుఁ జెప్పి తేరిపై
వే కొనిపోయి నీవు పృథివీసుత కోరినయట్ల కాఁగ వా
ల్మీకులయాశ్రమంబున సమీపమునన్ మనకృత్యనిశ్చయం
బాకమలాక్ష్మికిం దెలుపు మన్న నృపాలకునాజ్ఞ సేసితిన్.

15


క.

ఆశ్రమ మల్లదె మునిచర, ణాశ్రయవు నిరస్తశోక వై యుండు జగ
ద్విశ్రుతి యగు నీపతియును, నాశ్రమవిరహితుఁడ యింక నని పల్కుటయున్.

16

సీత తన్ను భర్త విడనాడినందులకై చింతించి లక్ష్మణునితో వయనిష్ఠురంబు లాడుట

క.

తాలిమి కొలఁదులఁ బోవని, వాలాయపుదిగులు గుండె వ్రయ్యఁ గదిరినం
గీ లెడపినజంత్రముక్రియ, నేలపయిం బడియె మేదినీతనయ వెసన్.

17