పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్యాయవిశోధనంబును నియంత్రితసత్యవచోవిలాసముం
బాయక విందు నెందు నరిభంజన సూరి జనానురంజనా.

98


చ.

అనవుడు భద్రుఁ జూచి ముద మందుచు రామధరాధినాథుఁ డి
ట్లనియె మదీయసంస్తుతులు నన్నియుఁ జెప్పితి కీడుమాట సె
ప్ప నగునొ కాదొ నాక ననుఁ బాపము సుట్టక యుండ నేమి గ
ల్గినఁ గలయంతవట్టును నకిల్బిషమానస చెప్పు మేర్పడన్.

99


క.

అనుటయు నతండు వెలవె, ల్ల నగుచు డెందంబు గొందలం బందఁగఁ జె
ప్పను జెప్పకుండ నేరక, యనుమానముతోడ నిక్కడక్కడ పడినన్.

100


ఆ.

అధిపుఁ డింగితజ్ఞుఁత డై యితఁ డొప్పని, పలుకు వినఁగఁ జెప్ప నలికియున్న
వాఁడు గొంకుఁ బాపవలయుఁ బొమ్మని తన, యెదఁ దలంచి యతని కిట్టు లనియె.

101


క.

లోకులమాటలు సెప్పిన, నా కెగ్గగునే ప్రియం బొనర్పు హితుఁడ వై
నీ కింత వెఱవ నేటికి, నేకాంతం బయినచోట నే నడుగంగన్.

102


ఆ.

కీడు గాంచి మనల నాడెడువారల, నోళు లుడుపఁగా మనోముదంబు
నొందుఁ గాన దీన నొండెగ్గు లే దని, తఱిమి యడుగుటయును వెఱపుఁ బాసి.

103


క.

ఇతఁ డెటు సెప్పు నొకో నా, మతి గలఁగెడు జనులపనులు మఱవక యుచిత
స్థితి నడపుదు నని తలఁకెడు, పతి కాతం డెలుఁగు రాలు పడ ని ట్లనియెన్.

104


సీ.

ఎల్లలోకంబులు నెఱుఁగ నత్యంతదురాచారుఁ డైనదశాననుండు
చెఱఁ బట్టికొనిపోయి యఱిముఱిఁ బెద్దకాలం బేనిఁ గేలివనంబులోన
నునిచిన నున్నయాజనకరాజాత్మజ నెడ నించు కేనియు నెగ్గు గొనక
ధైర్యంబు వాటించుతలఁపు వోవిడిచి మన్మథగోచరుం డయి మగుడఁ దెచ్చి


ఆ.

యనుగలంబు సేసికొనియున్నవాఁ డని, యజ్ఞు లయినజనము లాడుచుండ
నెల్లచోట విందు నింత నిక్కువ మని, పల్కుటయును రఘునృపాలకుండు.

105


క.

సుఱసుఱు డెందము సూఁడిన, తెఱఁగున నొక్కింత స్రుక్కి ధీరుం డగుటం
గొఱఁతవడకుండ వినుటకుఁ, బెఱవారల కిట్టు లనియెఁ బ్రియవదనుం డై.

106


క.

మీరలు నాసత్కీర్తియ, కోరుదు రేప్రొద్దుఁ గాన గురుదురితపరీ
హారము సేయం దగు నే, నీరూపమ యగుట నిశ్చయింపఁగవలయున్.

107


చ.

అనుడు విషాద మంది విజయాదులు దేవ భవచ్చరిత్ర మ
త్యనఘము దీనిఁ జూచి చెడనాడఁగ నాలుక యెట్టు లాడు దు
ర్జను లగువారు కొందఱు విచారవిహీనత నిట్లు పల్కఁగా
విని విని వారిమాటలకు వేసరి యుండుదు మెఫ్టు నెల్లెడన్.

108

లోకాపవాదభీతుఁ డై రాముఁడు తమ్మునితో నాలోచించుట

ఉ.

నావుడు మూర్ఛవచ్చినమనంబునకున్ ధృతి యూఁత యిచ్చి సం
భావన వారిఁ బోఁ బనిచి పార్థివముఖ్యుఁడు దల్లడంబునం