పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మఱపు ముసుఁగుపడ వేడ్కలు, దెఱపులు గొని నిగుడ రెండుదెఱుఁగులచేతం
బొఱివోవు నెమ్మనంబుల, నెఱి నిరువురు నలవరింప నేరరు రతులన్.

79


సీ.

మానవనాథుఁ డుగ్మలిఁ గౌఁగిలించుచో సడలుకే ల్బిగియించు కడఁక లేమి
యతివ భూధవునధరామృతం బానుచో దొప్పవాతెఱ యంటు తొట్రుపాటు
నృపతి లేమను గేలి నిపుణత నొరయుచో వెడఁగులై చెయ్యులు వీడుపాటు
వామాక్షి మేదినీవల్లభుఁ గొసరుచోఁ గొదలు పల్కులక్రియ గూడ కునికి


తే.

యొండొరులచిత్తముల నాఁటి యొలయుచున్నఁ, జొక్కు లెక్కుడు సేయంగసోల మడరి
యిరువురును సౌఖ్యరసములఁ గరువు గట్టి, పోసి చేసినరూపుల పోల్కు లైరి.

80


క.

భూపాలుఁ డిట్లు మోదం, బేపారఁగ మోహములకుఁ నెల్ల నివాసం
బై పాలించెను రాజ్య, శ్రీపెం పభిరామముగ నశేషధరిత్రిన్.

81

సీతాదేవి గర్భము దాల్చుట

ఉ.

అత్తల కెల్ల భూరివినయంబునఁ బంపు దగంగఁ జేయుచుం
జిత్త మెలర్ప నాథుపని సేయుచు బాంధవతుష్టి సేయుచున్
విత్తముల మహీసురుల వేమఱుఁ దృప్తులఁ జేయుచున్ మహో
దాత్తగుణాలి నొప్పె వసుధాసుత నిత్యశుభంబు పెంపునన్.

82


క.

సమ్మదమున భూచక్రము, తొమ్మిదివేలేఁడు లేలి తుది రాముఁడు దా
నెమ్మనమున నినకులము ధ్రు, వమ్ముగ సత్సుతులఁ బడయవలె నని తలఁచెన్.

83


ఆ.

తొమ్మనూటిమీఁదఁ దొంబదితొమ్మిది, వర్షములకు నంత వసుధపట్టి
యతిథివిప్రదేవపితృతర్పణంబుల, గర్భమహిమఁ దాల్చెఁ గౌతుకమున.

84


క.

అంత నొకనాఁడు లీలం, గాంతారత్నంబు నాథుకడ మెలఁగఁగ నే
కాంతంబునఁ గనుఁగొని య, త్యంతమనోమోద మడర నతఁ డి ట్లనియెన్.

85


సీ.

చంద్రికపైఁ బర్వు చారువల్లికవోలె వెలఁది నీయంగంబు వెలుకఁ బాఱె
హేమకుంభములపై నింద్రనీలములట్లు కాంత నీచనుమొనల్ గప్పు మిగిలె
వెడవాడులీలారవిందయుగ్మముమాడ్కి సుదతి నీకనుఁగవ సోల మందెఁ
బెన్నిధిఁ గాంచిన పేదచందంబునఁ బొలఁతుక నీకౌను పొదలుకొనియె


ఆ.

లలన నీదు చెయ్వు లలసంబు లయ్యె ల, తాంగి నీదుమందయానలీల
జడను దాల్చె గర్భసంపదకలిమి నీ, యందుఁ దేటపడియె నిందువదన.

86


ఉ.

మొగ్గల మైనకోర్కి దుదిముట్టఁగ నుత్సవలీలఁ జూడ నా
కగ్గము గాఁగ వంశము సుధాంశుఁడు గల్గిన రాత్రివోలె నీ
విగ్గురుగర్భసంపద వహించియుఁ జెప్ప వదేమి నావుడున్
సిగ్గును లేఁతనవ్వుఁ గదిసెం గమలాననముద్దుమోమునన్.

87

రాముఁడు కోరిక యడుగఁగా సీత గంగాతీరవనములకుఁ బోఁగోరుట

చ.

తనమదిలజ్జ వాపి వసుధాపతి మేవడి యైనమాట పొం