పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తనదు మైదీవకుఁ దావలంబుగఁ జేసి పులకలచిత్తంబు నెల వెఱింగి
బెరసినమేవడి సరులఁగాయువు గని కన్నులచెన్నున నన్నుఁ గాంచి


తే.

సొగిసి కౌగిట సోలెడు మగువయంత, రంగ మావిష్ట మైనటు లంద కలసి
తగులు దగిలించుటయును నిద్దఱకు సరియ, కాఁగ నధిపతి లలితాంగిఁ గవసె నర్థి.

72


చ.

ఎడఁ బొలివోనివేడుకల యేడ్తెఱసొంపున నంతకంత కె
క్కు డగుమదంబుపేర్మి రతికోర్కులు గొమ్మలు వోవ నప్పుడ
ప్పుడ నలిఁ జేరినట్టులు విభుండును వారిజపత్రనేత్రయుం
గడపల లేనికేలితమకంబున నుల్లము లుల్లసిల్లఁగాన్.

73


సీ.

ఎలమి నొండొరులకుఁ దలయంపులుగఁ జేయు బాహాలతలు జన్మఫలము లొంద
నలి నొండొరులమీఁదఁ బొలుపారుకనుదోయి సుఖములఁ జుబ్బనుచూఱ లాడఁ
గాయ్వున నొండొంటిఁ గదిసినతనువులు పులకాంకురంబులఁ బ్రోది గాఁగ
నిచ్చమై నొండొంటిఁ జొచ్చినమనములు నినుపారునింపుల నెలకొనంగఁ


ఆ.

గడఁక లొండొరువులఁ గడవఁ గేలీచతు, రతలు వెలయఁ జూడ్కు లతిశయిల్ల
సుఖముసొంపు నొక్కసూటిన నడవంగ, సతియుఁ బతియుఁ గ్రీడ సల్పి రర్థి.

74


ఉ.

లేని నెపంబు పెట్టి, మదలీలకు నాఁక యొనర్చి మానముం
బూనినయట్లు సౌ రెదకుఁ బుక్కిటిబంటిగఁ జేసి యల్క వే
పో నొకకారణంబుపయిఁ బూని వెసం బయిపాటు మున్నుగాఁ
దేనియ లుట్టఁ దేఱు జగతీపతి కుగ్మలి రాముఁ డింతికిన్.

75


సీ.

అదరులు గదిరిన నఱిముఱి వర్తిల్లు చెయువులక్రందునఁ జిక్కువడుచు
నేర్పులు గడఁగిన నిరతంబు లై చెల్లు కామతంత్రంబులఁ గళుకు లగుచుఁ
గోర్కు లేచినఁ ద్రిప్పికొనునింద్రియంబుల యక్కఱ దీర్పంగ నడరఁ బడుచు
మెచ్చులు వచ్చిన మిగుల నానందించు మనములతలపోఁత కనువు గొనుచుఁ


తే.

దనివి వొందిన నల్లన తలఁపు మగుడ, వేడుకలయెడఁ గొసరుల వింతతమక
ములకు మొదలైనఁ బొదలుచు నెలఁతుకయును, మనుజపతియు నొనర్చిరి మదనకేలి.

76


క.

ఒండొరువులమదనకళా, పాండిత్యము మెచ్చమియు నెపం బిడ నెపమై
యెండొరులకు నానంద మ, ఖండము గావించురతము గైకొండ్రు తగన్.

77


సీ.

తూలెడునునుగురుల్ దోతెంచుఘర్మాంబువులఁ దోఁగి నుదుటిపై మలఁగుచుండ
లలిసొంపుపెంపునఁ బొలయక కనుదోయి నానుచు నెడనెడ మ్రానుపడఁగఁ
గుచములనడుమఁ దూగుచు నున్నహారము లల్లన చనుమొనలందుఁ గ్రాల
బెడఁ గొంద నల్లాడు తొడవులమెఱుఁగులు వెడలక యచ్చోటఁ గడలుకొనఁగఁ


తే.

గేలికడఁక దోడ్తో నడఁగించి యవయ, వములు సడలంగఁ జేయుచు వచ్చుచొక్కు
లేఁతదమిఁ గ్రొత్త చెన్నొందు లేమచంద, మధిపుడెంద మానందమయంబు సేసె.

78