పుట:నారాయణీయము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii

ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహకర్తలయి కవిత్త్వ వేదిగ విద్వన్మాత్ర విదితులయి విద్యాశాఖాధికృతులయి 'అశోక చరిత్ర ' మను నవ్యాంధ్ర ప్రబంధమును రచించిన బహుభాషాభిజ్ఞులు, మత్కృతిని సమీక్షించి యెనలేని నెనరున నన్ను "కవిరా"జని ముచ్చటగొని యాశీర్వదించిన ఋషికల్పులగు బ్రహ్మశ్రీ కల్లూరి వెంకట నారాయణరావు ఎమ్. ఏ. గారిని సాంజలిబంధముగ సంభావించువాఁడను.

ఉపాసకులయి, ఉదారభావ గంభీరముగ నా కృతికి సమీక్ష రచించిన నా సహాధ్యాపకులు నాప్తులు విద్యాప్రవీణులగు బ్రహ్మశ్రీ చివుకుల సుబ్బరామశాస్త్రులవారికి నా ప్రణతులు.

అజంతా ముద్రణాలయాధిపతులయి, ప్రత్యక్షర పర్యవేక్షణ మొనర్చి నాగ్రంథమున కీయందచందములు తీర్చి దిద్దుటయే కాక మత్కవితం బ్రశంసించిన శ్రీనివాససోదర శతావధానులకు మత్ప్రశంసలు,

ఈ కృతి సుందరిని స్వీకరించి సర్వాంగసుందరముగ నలంకరించి సకుటుంబ సపరివారులై యనుపమ రాజలాంఛనములతో నఖండ భక్తి వైభవముతో శ్రీ గురువాయూరు శ్రీకృష్ణదేవు సర్ధాంగి నొనరించి తత్సన్నిధానమున (ది 13-10-57 తేదీన) బరమోత్సవము గావించిన కేరళ రాజ్య పాలకులగు శ్రీ రామకృష్ణరావు మహాశయులను, దత్పురస్సరముగ మమ్మును ఆశీర్వదించిన మహాశయులలో ప్రప్రథమ గణనీయులు, శతవృద్ధులు, శతాధిక గ్రంథకర్తలు, ఆంధ్ర ప్రభుత్వాస్థానకవి, మహామహోపాధ్యాయ, కవిసార్వభౌమేత్యాది బిరుదావళీ విరాజమానులును. మదీయమగు నొకానొక కృతిని దమంత వలచి చేఁబట్టిన యస్మదీయవంశ దౌహిత్రులు నగు బ్రహ్మశ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారికి నా ప్రణతులు.

వేదార్థ ప్రవచన నిపుణులు, శ్రీ తంగిరాల వీరరాఘవ ప్రతిష్ఠిత శ్రీరామ సాంగవేద పాఠశాలా ప్రధానాచార్యులు నగు బ్రహ్మశ్రీ కుప్పా లక్ష్మావధానులవారు తంతి మూలమున మమ్మి ట్లాశీర్వదించిరి.

     “సమానానా ముత్తమ శ్లోకో౽స్తు"

శ్లో. కృతిస్సుకృతితా మీయా దర్పితా స్వయ మీశ్వరే
    భవతాం కృతితాం నేయా దద్వితీయ పదాంచితా