పుట:నారాయణీయము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ii

ఏ మహానుభావునియం దాబాల్య మలవడిన భక్తి నాచే నీ గ్రంథముం బలికించెనో యట్టి యాంధ్ర భాగవత కర్తయగు బమ్మెరపోతరాజు కవిరాజునకు వినతిసేసి యిట్లు వినుతించెద .

అపర శుకావతారమది యాంధ్ర సరస్వతి నోముపంట మ
త్తపముల రాశి భక్తి కవితారసవాహిని రామకల్ప పా
దప సముపాసనాత్త పరతత్త్వఫలంబు దరిద్రదేవతా
క్షపిత దురంత సంసృతి నఖండ కళాకృతి నెంతుఁ బోతనన్.

లేతవయస్సున౯ జనని లేపిన మానస రాజహంస మా
పోతన వాక్సుధాలహరి పొందున సారము లానియాని యు
ద్ద్యోతితమై ముకుంద పదతోయజ శయ్యల సోలి వ్రాలి యే
కూతలు కూయునో యెఱుఁగఁ గోవిదు లోపిక నోపి కావరే.

నాకృతి నుపలక్షించి వాత్సల్య రసా సేచనమున నన్నును గృతిస్వీకర్తలను దీవించుచు, సువిపులమైన 'భూమికను' రచించిన నిరతిశయగుణ భూషణులు గవితాభూషణులునగు బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రులవారిని గూర్చిన నా భావోన్మేషమిది :

నాలోపమ్ము లెఱుంగఁజెప్పి మటియు౯ నా యూహలోలేని యం
దాలన్ వ్యాఖ్య యొనర్చి సద్గురు కృపాధారామృతాప్లావ మిం
దాలక్షించి కటాక్షమున్ నెఱపి నాయం దంతరంగమ్ము మా
ర్మూల౯ నక్కిన చీకటుల్ దొలఁచు సూర్యు౯గొల్తు ధీవర్యునిన్.

రవియౌచు౯ గవియౌచు వ్యాకరణ మర్యాద౯ బ్రయోగప్రమే
య విధి౯ దాన ప్రమాణమై సహృదయుఁడై యవ్యాజ వాత్సల్య పూ
ర్ణ విలోకమ్ముల నాదరించిన బుధు౯ వ్రాక్పుణ్య సంబంధి మా
కవితాభూషణు వెంపరాల కవిలోక గ్రామణిన్ గొల్చెదన్ .

ఆంధ్ర విశ్వకళా పరిషత్తునం దాంధ్ర సాహిత్య విభాగమునం దాచార్యులై, అస్మదాంధ్ర సాహితీ ప్రథమోపదేష్టలై, నిరవధిక వాత్సల్య, రసనిధియు సౌజన్యావధియునై నా కృతిని “పరిచయము" నొనరించి మమ్ము దీవించిన బ్రహ్మశ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రులవారికిఁ బ్రాంజలి నయ్యెదను,