పుట:నారాయణీయము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36


భావమును భావించి తెలుఁగుదనమునూహించి పదశక్తిని పరిశీలించి ప్రసాదమాధుర్యాది గుణముల పాటించి గ్రంథమునందు స్వత్వమును సంపాదించుకొనెను.

నామరూపాత్మకమైన ప్రపంచమున ముందు శబ్దమును పిదప అర్థమును గ్రహించుట జీవి స్వభావము. శబ్దార్థముల అవినాభావస్థితిని ప్రకృతి పురుషుల సామ్యస్థితిగ గుర్తించుట సమ్యగ్దర్శనము. రెండు నొకటియనితెలియుట జ్ఞానము. భాగవతమున శ్రీకృష్ణుఁడు చిత్ప్రకృతియగు పరదేవతయనియు పురుషుడనియు శ్రీ వ్యాసభగవానులు వర్ణించిరి. ఈ యలౌకిక జ్ఞానమునకు వ్యక్తనామరూపములు ప్రథమసాధనములు. నామరూపముల సూక్ష్మదశయగు నాదవృత్తుల యద్వైతస్థితిని చూరగొనిస సిద్ధుల వాక్కును వెన్నంటి అర్థము పరుగిడును. వారు బోధింపఁదలఁచిన అర్థము స్వభావ మధురము. దానికి తోడై శబ్దమాధుర్యము స్ఫురించుచుండును. ఈ శబ్దార్థప్రతిపత్తినే కవికుల తిలకుఁడగు కాళిదాసు "వాగర్థావివ సంపృక్తౌ" అనుచు నా కాంక్షించెను. శ్రీ జయదేవ, లీలాశుక, నారాయణతీర్థ, శంకరభగవత్పాదాదుల కవితయం దీలక్షణము సమగ్రముగ నున్నది. వారు కవులుగ కీర్తి నందలేదు. ఆచార్యులు, భక్తులు నగువారు అన్నిట ప్రమాణభూతులై వెలసిరి. పోతన యీ శ్రేణికిఁ జెందిన, తెలుఁగుకవి. 'మందార మకరంద మాధుర్యమునఁదేలు' పోతన పద్యమును విని ఆనందింపనివాఁడు పండిత పామరులలో నేడి ? అందలి శబ్దము అర్థము రెండును బ్రహ్మ ప్రతీకములై ఆనందానుభవమును లేశమాత్రముగనైన అనుభవమున గోచరింపఁజేయును. ఈ శబ్దవై చిత్రిని ఆలంకారికుల శబ్దాలంకార లక్షణములతో పోల్చుకొని శబ్దాలంకార ప్రచురమయిన చోట దీనిని నధమ కావ్యముగ నెన్న ననువుగాదు. సర్వభావములకు పాత్రమైన భగవద్భావ మధురమైన అర్థమును స్ఫురింపఁజేయుట యిందుగల అసాధారణగుణము. భక్తిరసఫ్లావితమైన భాగవతమును భగవస్మహిమానుభవ సిద్ధుఁడగు పోతన తెలుఁగున నందించుట తెలుఁగువారి అదృష్టము.

ఆంద్రీకృతమగు నారాయణీయము విషయమునను శబ్దార్థ సామ్యమునను ఆంధ్ర భాగవతమునకు క్లప్తరూపమనఁ దగియున్నది. నిరంతరము శ్రీమద్రామాయణ పారాయణాదులచే రామతత్త్వము భావించిన యిక్కవి శ్రీ రామకృష్ణరాయ కవితో సౌభ్రాత్రము నందుకొనెను. వీరిరువురు శ్రీ కృష్ణ