పుట:నారాయణీయము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమీక్ష - 1

'విద్యాప్రవీణ - ఉభయభాషాప్రవీణ'

బ్రహ్మశ్రీ చివుకుల సుబ్బరామశాస్త్రి

నారాయణతత్త్వమును నిరూపించు నారాయణీయమను కావ్యమును కేరళదేశవాసియగు నారాయణట్టు అను కవి సంస్కృతమున రచించెను. ఇది సర్వపురాణసారమనదగు శ్రీమద్భాగవతమునకు సంగ్రహరూపము. వైయాకరణియగు కవియొక్క ప్రౌఢిమ కావ్యమునఁ గానబడుచున్నది. విషయమును విడువక భాగవతతత్త్వమును కరతలామలకము గావించెను.

కవి గ్రహించిన యితివృత్తమహత్త్వమున కావ్యము చిరస్థాయి యగును. భాగవతమున వైదిక భక్తిస్వరూపము భూమికాభేదమున నిరూపింపఁబడినది. జ్ఞేయబ్రహ్మము ప్రాప్యమగు తత్త్వము. ఇందు వర్ణింపఁబడిన భగవల్లీలావి శేషములకు ఇచ్ఛామాత్రమైన చిద్రూపిణియగు ప్రకృతి ఉపాధి. కావుననే శ్రీకృష్ణదర్శన స్పర్శనాది మాత్రముననే భక్తులు కృతార్థులైరి. ఈ గాథ లీ కావ్యమునకు ఇతివృత్తము. నిత్యమగు నితివృత్తముతో కావ్యము స్థాయినందుననిన ప్రామాణికోక్తి పాటించి తలచిన శ్రీ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు నారాయణీయమును దెలుఁగున ననువదించిరి. కర్మోపాసనావిశేషములఁ బవిత్రమైన వంశమున జన్మించిన శ్రీ దీక్షితుల సహజ భక్తిభావనాభావితమైన చిత్తమున కీ గ్రంథము హత్తిసది. పలువురు కవులు సంస్కృత కావ్యముల నాంద్రీకరించియు నీగ్రంథము నంటకుండుట శ్రీదీక్షితుల పుణ్యవిశేషము. శ్రీపోతన సహజపాండితీమహిమచే దన జన్మము సార్థక మొనరించిన విధమున వీ రీ కృతిచే తనకబ్బిన కవిత్వాదిసంపదల జన్మసాఫల్యము నందిరి. ఈ రచనచే చిద్విషయభావితమైన చిత్తము శ్రీ కృపావిశేషపాత్రమై ఉత్తరభూమికనందికొనినది. తత్ఫలముగ “గురుకృపాలహరి" అను సంస్కృత స్తోత్రము వీరి ముఖమున నవతరించివది.

కవికి స్వతంత్రరచనకంటె అనువాదము శ్రమసాధ్యము, మూలాను సరణమున ధారావాహికమగు శైలి కుంటుపడుచుండును. ఈ అనువాదము స్వతంత్ర రచనగా సాగినది. శ్లోకమునకు సరియగు పద్యమును వ్రాసినను