పుట:నారాయణీయము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిచయము

బ్రహ్మశ్రీ విద్వాన్ దువ్వూరి వేంకటరమణశాస్త్రి

ఆంధ్ర విశ్వకళాపరిషత్తు.

కేరళదేశీయుఁడును బదునాఱవ శతాబ్ది యుత్తరభాగమువాఁడును నగు 'నారాయణభట్ట మహాకవి' తనకు సంక్రమించిన వాతరోగమును బాపికొనుటకయి "గురువాయు పురాధీశుఁడగు నారాయణు" నుద్దేశించి సంస్కృత భాషలో నారాణీయమను స్తుతిప్రబంధమొకటి రచించెను. ఇది నూఱుదశకములుగా సుమారు వేయి శ్లోకములలో విరచితమయినది.

భాగవతసారమనఁదగిన యీ గ్రంథమును కమ్మని తెనుఁగులో ననువదించి నారాయణభట్టమహోదయుని భావనాలాలిత్యమును ఆంధ్రుల కందించు భాగ్యము మా సుబ్రహ్మణ్యదీక్షితులకు లభించుట ఆతనికి ధన్యతాపాదకము. మాదృశులకు ఆనందదాయకము –

శ్రీ దీక్షితులు అనేక రచనలద్వారమున ఆంధ్రులకు సుపరిచితులు. సంస్కృతాంధ్ర కవితాపాటవముతోపాటు నైష్ఠికజీవితము నలవఱచుకొన్న ధన్యజీవి. ఈయన యధ్యాపకమార్గము నవలంబించి చాలినంత తీఱిక లేకున్నను సహజసిద్ధమయిన కవితాసాధనతో ఆంధ్రశారద నారాధించుచు బుద్ధిని, వాక్కును, జీవితమును బవిత్రమొనరించుకొనుచున్న సహృదయుడు. ఇందులకీ నారాయణానువాదమే ప్రబల నిదర్శనము.

ఈ యనువాదము కడుంగడు కౌశలముతో నిర్వహింపఁబడినది. కంఠోక్తిగాఁ జెప్పినఁగాని యియ్యది యనువాదమని తెలియనంతటి సహజసుందరము. సలక్షణమగు పదప్రయోగము, సరళమగు సమాసప్రక్రియ, సరసమగు వాక్యరచనయుఁ గలిగి వ్రనన్న గంభీరమగు శైలిలో నడచిన యీ రచనను ఆమూలచూడముగ ముదమార, చవులూరఁ బరికించి, అమితానందము నందితిని.

ఏనాఁడో బాల్యమున మాయిద్దఱకును ఉల్లాసకరమయి అత్యల్పకాల మేర్పడిన విద్యాసంబంధము ఈనాడు నా కెంతటి యాహ్లాదము గూర్చినదో నాకే యెఱుక.