పుట:నారాయణీయము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32


అనినప్పుడు అన్యధా వ్యాఖ్యానింపఁ బనియేముండును? నిజముగా ఆ దంపతులతోబాటు బూర్గులవారందఱును ధన్యచరితులు.

శ్రీ దీక్షితకవికి నీ కావ్యరచనమునకుఁ బురికొల్పి, కృతికన్యాదత్త స్వీకారమున కనుసంధాతయై, సౌభ్రాత్రమున మాత్రమే కాక సౌహార్దమునఁ గూడఁదోడునీడయై, తర్క వేదాంతశాస్త్రము లధిగమించి, సకలపురాణములఁ గరతలామలక మొనర్చుకొని, గానవిద్యానదీష్ణుఁడై న పండితవతంసుఁడు దీక్షితకవి యనుఁగు తమ్ముఁడగు శ్రీ వీరభద్రశాస్త్రి మఱియు ధన్యుఁడు. భూమికారచనా ప్రసంగమున నామూలచూడము నీ కృతిని బరికించుచు, నీ నాలుగు దివసములు లేని 'పదేపదే' కృష్ణనామ పునశ్చరణముచేయు మహాభాగ్యము నెనసిన నేనును ధన్యజీవనుఁడనే యనుకొనఁబోవ నహంకారమగునని జంకి విరమింపక తప్పనిదయినది.

పురుషార్ధవిదానములై రసమయములైన యీ జాతి యుత్తమ నిబంధములను, దమ్ము లిరువురును జక్రరక్షకులై తోడుసూప మాదీక్షిత కవీంద్రు డింకను నెన్నియో రచించుగాక ! ఆ యుత్తమచరితుని సతీసుతాదులు నిరామ యాయుష్మంతులై యభ్యుదయము నెనయుదురుగాక ! కవితాధురంధరుఁడగు శ్రీ రామకృష్ణారాయప్రభువు సరస్వతీపాదారవిందపూజాసుమములుగాఁ దన కావ్యములను, కృతిస్వీకృతులచే నితర కవిసింహుల కావ్యములను, రచించి, రచింపఁజేసి రాష్ట్రముతోపాటు ఆంధ్రవాజ్మయమును గూడ విశాల మొనరించుచు సభ్యుదయపరంపరలొందుఁగాక ! గురువాయూరుపురాధినేతయగు శ్రీమన్నారాయణస్వామిదేవుని యవ్యాజకరుణాకటాక్షచంద్రికాప్రసారమున బ్రసాదగుణభరితమై, మాధురీధురీణమై యాంధ్రవాఙ్మయమున కొక నూతనాలంకారముగా నవతరించిన ఈ నారాయణీయము జగద్వ్యా ప్తినొందుటయే కాదు, కేరళదేశమున సంస్కృతనారాయణీయమువలె నాంధ్రదేశమున నింటింట నాబాలగోపాలమునకు నిత్యపారాయణగ్రంథమై, సకలతాపనిర్వాపణమై, కల్లూరు, బూర్గుల పావనవంశద్వయీ యశఃపతాకయై యా చంద్ర తారార్కము మిన్నుముట్టి విలసిల్లుగాక ! స్వస్త్యస్తు, సెలవు.

ఇట్లు

విద్వద్విధేయుఁడు

వెంపరాల సూర్యనారాయణశాస్త్రి

ఆమలాపురము

విలంబి భాద్రపద పూర్ణిమ