పుట:నారాయణీయము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31


మ. నిరతి౯ యోగులకు౯ ద్వదంగతతి నెంతేఁ దియ్యనై, ముక్తిమం
     దిరమై భక్తుల కోర్కుల౯ గురియుచో నీ పాదమూలమ్ము స్వ
     స్తరుపాళి౯ జిగురౌచుఁ గృష్ణ ! వెతయంత౯ బాపి నాభావమం
     దరుణజ్యోతి స్ఫురించి కూరుచుత బ్రహ్మానంద రాజ్యేందిర౯ !

అని యోగులకు నీ సకలాంగములకంటెను మధురముగాఁ దోచునదియు, ముముక్షువులకు మందిరమగునదియు, భక్తులకుఁ గోర్కులను గురియు కల్పవృక్షపుఁ జిగురాకుగ వెలయునదియు నగు నీ పాదమూలము కృష్ణా ! నా చిత్తమున నిత్యముగా నుండి, సకల తాపములను హరించి బ్రహ్మానందము నొసంగునుగాక ! యని ముముక్షువునకుఁ బరమప్రార్ధ్యమగు పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మానందమును మాత్రము కోరి, నిష్కామ కర్మస్వరూపము భాసిల్లఁజేసి - "అరయన్నేరక నీ మహత్త్వ మెది యే నన్నానొ విశ్వేశ ! యప్పరుషమ్ము౯ క్షమియింపు-- "అని తన పొరఁబాటెందేని గలిగెనేమో, దానిని క్షమింపుమనుచు--నా సూక్తి నీ దయకుఁ బాత్రమగుఁగాక యని తా నుచ్చరించిన స్తోత్రరూపవాణి కంగరక్ష గోరుచు మంగళాంతముగ గ్రంథము ముగించెను.- జన్మము ధన్యమొనరించుకొనెను, జగత్తును ధన్యమొనర్చెను. ఇఁక నా మిత్రము సుబ్రహ్మణ్యదీక్షిత కవిరత్నము అక్షరాక్షరముగ. నారాయణీయము మూలమునంతయుఁ జదివి తనలోఁ దానే మురియుచు నూరకుండక , యాద్యంతము నాంద్రీకరించి, యాంధ్రుల స్థిరకృతజ్ఞతకుఁ బాత్రుఁడగుటవలన ధన్యజీవనుఁడయ్యె. ఈ కావ్యకన్యను దత్తపుత్త్రికగా స్వీకరించి, సంజ్ఞాదేవీ రమణుఁడగు సూర్యభగవానునకు భేదబుద్ధి కలుగనట్లు మెలఁగు ఛాయాదేవివలె మెలంగుమని నారాయణభట్టపాదకృతి కన్యాపతియగు తిరువాయూరు దేవునకే పత్నిగా నర్పించిన శ్రీశ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు ధన్యతముఁడు. కృతికన్యాదాన శుభవేళఁ బరమేశుని పాదములు తన భర్త కడుగుచుండ బంగరు కలశమున నుదధారవోసిన శ్రీ రామకృష్ణారాయుని ధర్మపత్ని యనంతలక్ష్మి ధన్యాతిధన్య. ఇది స్తనమనుకొందురేమో ! కాదు. వాస్తవము. ఈ భావమును గృతి నర్పించుచు రామకృష్ణారాయఁడే

"అన్యుల్ గారు కవుల్ సగోత్రజు, లనన్య ప్రీతి మాచేత నీ
 కన్యాదాన మహోత్సవమ్ము జరుగంగాఁ గోరి, రెంతేనియు౯
 ధన్యమ్మయ్యెను మా సతీపతులదౌ దాంపత్యము"