పుట:నారాయణీయము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17


ఆహా ! భావ మెంత లలితముగా నున్నదో రచనయు నంత లలితమై వెలయుట భాగ్యము. శ్రుతి స్మృతి ప్రోక్త వ్రతాదులు పాపమును శమింపఁజేయునే కాని దాని వాసనను నిర్మూలింపలేవఁట. భగవత్పాదసేవ పాపము నణఁచుట'యే కాదఁట, దాని వలని జిడ్డు - అనఁగా వాసనను గూడ నశింపజేయునని యెంతయో గంభీరమగు నర్థ మిందు తేటతెల్ల మొనరింపఁబడినది.

మఱియు నీ క్రింది పద్యమునఁ గల "పాణములున్ హరీయనన్, అను జాతీయమువలన నీ దీక్షిత కవివర్యులకు అనువాదమునఁ గల స్వాతంత్ర్యము వ్యక్తమగుచున్నది.

“ఎన్ని యొ పుట్టువుల్ గడచి యెన్ని యొ పాపము లాచరించినాఁ
 డిన్నిటికిన్ బ్రతిక్రియగ నిప్పుడు ఈ ప్రాణములున్ హరీయనన్ '
 మున్న హరీ యటంచుఁ దన ముద్దుల బిడ్డనిగూర్చి యేని వాఁ
 డన్నది చాలదా యని రయారె భవచ్చరణాబ్జ సేవకుల్ ."

'ఇందు కవి వాణి ప్రసన్న శరన్నదీ వేణియై జాలువాఱుచున్నది. గజేంద్రమోక్షమున పోతనార్యునివలెఁ గాక మూలానుసారము గరుడారూఢుఁడయియే హరివచ్చి, గజేంద్రుని రక్షించినట్లు స్పష్టముగ నిందుఁ జూడఁగలము.

“విని యా కేవల నిర్గుణ స్తవము 'నాపి' ల్పిందులో లేదు నా
 పని కా దీస్తుతి నన్నుఁగా' దనుచు నా బ్రహ్మేంద్ర రుద్రాదు లా
 తని కడ్డంపడ రార యొక్కరు ; గరుత్మద్వాహనారూఢుడై
 యనఘా ! శ్రీహరి ! నీవ వచ్చితివి సార్వాత్మ్యంబు దీపింపఁగన్.”

“ఛందోమయేన గరుడేన సముహ్యమాన, శ్చక్రాయుధో౽భ్యగమ దాశు యతో గజేంద్రః' అను భాగవత శ్లోకము ననుసరించియే నారాయణ పండితులును, 'సర్వాత్మా త్వం భూరి కారుణ్య వేగా త్తార్క్ష్యారూఢః | పేక్షితో౽భూః పురస్తాత్ ” అని గరుడారూఢునిగానే వర్ణించినారు. కాని 'అభ్రగపతిం బన్నింపక' పాదచారమునఁ బరమేశ్వరుఁడు పరువెత్తినట్లు చెప్పలేదు. కావునఁ దదనుసారమే యీ యనువాదమును నడచినదని సహృదయులు గ్రహింతురు గాక !

క్షీరసాగరమున లక్ష్మి యుదయింపఁగనే యామె రూపమును గాంచి యందఱును మురిసిపోయిరఁట. ఆ సందర్భమున మూలగ్రంథమందు.

“జగదీశ ! భవత్పరా తదానీం కమనీయా కమలా బభూవ దేవీ
 అమలా మవలోక్య యాం విలోల స్సకలోపి స్పృహయాంబభూవ లోకః.