పుట:నారాయణీయము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18


'లోకు లెల్లరు నామెను జూచి యాసించిరి' అనియుండ,

"కలకలలాడుచున్ గలిమికన్నియ వన్నెలమిన్న నీపయిన్
 వలపులఁగుల్కు కల్కి. యెలనవ్వులతో నటఁ దోఁచినంత న
 క్కులుకు మిటారి తళ్కు బెళుకుల్ గని యొండొక చూపులేని చూ
 పుల వెలఁబోసి లోఁగొని రపూర్వ తదీయవిలాస మెల్లరు౯."

అని యనువదింపఁబడినది. మూలముతోఁ దులఁదూఁచినచో రాసిక్యమున ననువాదమువంక ములువ్రాలక మానదనిపించుచున్నది. కమల 'కమనీయ' అని మూలము. ఆ కామనీయక మనువాదమున 'కలకలలాడుచు౯ వన్నెలమిన్నగా' వివృతమైనది. 'భవత్పరా' అని మూలము 'నీపయి౯ వలపులఁగుల్కు. కల్కిగాఁ' బెంపఁబడినది. 'అమలామవలోక్య తాం' అను మూలమును గొని యా యమలత్వము 'అక్కులుకుమిటారి తళ్కు బెళుకులుగా' పెంపొందింపఁబడుటయే కాదు. తామవలోక్య సకలోపి 'లోకో విలోలః స్పృహయాం బభూవ' అనుదానిని 'ఒండొక చూపులేని చూపుల వెలఁబోసి తదీయవిలాస మెల్లరును లొఁగొనిరి' అని యనువదించుటలో “ఒండొక చూపులేని చూపుల' (= నిశ్చలదృష్టులతో) అనుట "ఆ సిగ్గుకు సిగ్గులేదు" అనిన చేమకూర చమత్కారమునకు స్ఫోరక మై రాసిక్యమును చాటుచున్నది. అచ్చటి వ్యంగ్య చమత్కారము సహృదయైక వేద్యము, ననిర్వచనీయము నగుటచే నీ ప్రసంగ మింతతో ముగించి మఱొక ఘట్టము నరయుదము.

విష్ణుని మోహినీవేషము నరసిన రక్కసుల కామవికారము వర్ణించు సందర్భమున

“హంగగు మేనికాంతి వయసందున 'శ్యామ' వనంగనొప్పి యు
 త్తుంగ కుచద్వయిన్ నడుము తూఁగ నటింపఁగఁజూచి, దప్పి పెం
 పుంగొని సోలివ్రాలుచు నపూర్వ భవత్కు చకుంభ విభ్రమ
 మ్ముంగొననెంచి - కాదనిరి పూర్వ సుధారసపూర్ణకుంభమున్."

మేనికాంతిచే 'శ్యామ' అనఁగా నల్లనిది, వయసునందును 'శ్యామ' అనఁగా యౌవనమధ్యస్థ, అని (శ్యామా యౌవనమధ్యస్థా) శ్లేషాలంకార చమత్కారమును, మోహిని యొక్క 'యపూర్వ కుచకుంభవిభ్రమము పై' నాసగొని, పూర్వ సుధాపూర్ణకుంభము కాదని రనుటలోని యర్ధచమత్కారమును, పఠితల హృదయవేగము నాపి రవంత యాలోచనలోఁ బెట్టక విడువనివి. ద్రాక్షా