పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము- ఉపోద్ఘాతము

29

దయమును గృతిపొందిన నంద్యాల కృష్ణమరాజు. కనుక నీకృష్ణమరాజునకు ఆవళి చినౌబళుఁడు పెదతాతమనుమఁ డన్నమాట. మఱియు నీ నంద్యాలవంశమున నింకొక చిన్నయహోబళుడును, గుమారౌబళుఁడును, చిన్నయోబళుఁడును, ఓబయ్యయు, ఓబళరాజును, పెద్ద-ఉద్దండ-కనగిరి-శబ్దపూర్వకౌబళులును గనుపట్టుచున్నారు; కాని, నామసామ్యముచేతను బితృనామముం బట్టియు నావళి చినౌబళుఁడే ప్రోలుగంటి రంగన్న ప్రభు వైనట్లు నిర్ధారింపవలసి యున్నది. చూడుఁడు!

ఈ గ్రంథమునందే ప్రథమాశ్వాసాంతపద్యములయందు:-

క.

హావళిచినయౌబళవసు, ధావల్లభమంత్రివర్య! ధైర్యాహార్యా!
ధీవిభవశోషితార్యా! పావననేత్రాబ్జయుగకృపారసధుర్యా!

అనియును దృతీయాశ్వాసాంతపద్యములయందు:-

ఉ.

హావళి చిన్నయోభళధరాధిపశేఖరసైన్యపాల! నానావిధ ....

అనియు విస్పష్టము చేయఁబడినది. ఈయావళి చినౌబళుని గుఱించి పింగళి సూరనార్యుఁడు కళాపూర్ణోదయకృత్యాదియం దిట్లు వ్రాసియున్నాఁడు.,

క.

ఆనారసింహవిభుఁ డస, మానగుణుఁడు రఘుపతిక్షమావరుఁడు యశ
శ్శ్రీనిధియహోబళాఖ్యధ, రానాథుఁడు సకలగుణవిరాజితుఁ డయ్యెన్.


క.

ఆమువ్వురలో నగ్రజుఁ, డైమించునృసింహునకుఁ దదంగనయగుశ్రీ
రామాంబకు నుదయించె మ, హామతి యావళి చినౌబళాఖ్యుఁడు వెలయన్.


ఉ.

దేవవిభుండు భోగమునఁ దీవ్రమయాఖుఁ డఖండచండతే
జోవిభవంబునం; దపనసూనుఁ డనూనవితీర్ణిపెంపునన్
దైవతమేదినీధరము ధైర్యమహత్త్వమునం దలంపఁగా
నావళి చిన్నయోబమనుజాధిపముఖ్యుఁడు రాజమాత్రుఁడే?

ఈపద్యములకును నీనారసింహపురాణములోని పైయాశ్వాసాంతపద్యములకును నామవిషయమున విసంవాదలేశ మేనియు లేకుండుటచేఁ బ్రోలుగంటి రంగప్రధానికిఁ బ్రభు వైన యావళి చినయోబభూపాలుఁ డితఁడే యని తెల్ల మగుచున్నది. కళాపూర్ణోదయకృతిభర్త యగునంద్యాల కృష్ణరాజువలెనే యీయావళి చినయోబభూపాలుఁడును ఆరెవీటి బుక్కరాజున కాఱవతరమువాఁ డగుటచే మ రా. రా. కందుకూరి వీరేశలింగముపంతులుగారి లెక్కప్రకారము క్రీ. శ. 1473-వ సంవత్సరము మొదలుకొని క్రీ. శ. 1481-వ సంవత్సరమువఱకు రాజ్యము చేసిన బుక్కరాజునకుఁ దరువాత వచ్చిన యతనిసంతతి