పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2

నారసింహపురాణము, ఆ-3

111


క.

మదిరాకన్యక హంసుని, హృదయంబున నిలిచె సురమహీధరగుహలో
మదభుజగయువతి క్రుమ్మరు, విధమున లుబ్ధప్రసక్తవిత్తములీలన్.

125


క.

హృదయముచొచ్చిన మదిరా, మదచేష్టలచేత మేను మఱచి ప్రబోధా
భ్యుదయరవి గ్రుంక హంసుఁడు, నిదురయుఁ బోఁజొచ్చె నిఱ్ఱనీల్గుచు నచటన్.

126


క.

కొండంతమేను బూడిద, పండుగ నిలఁ బొరలిపొరలి ప్రబలనిజభుజా
దండము తలగడగా నా, ఖండల రాజ్యావహర్త కడు నిద్రించున్.

127


క.

నిద్రాసమయంబున నా, యుద్రిక్తస్వాంతుఁ డిచ్చునూర్పులవడి సా
ముద్రజలంబులు ఘూర్ణిలు, నద్రులు గంపించు ధరణి యట్టిట్టు వడున్.

128


క.

మును వెన్నాడినసురపతి, యును నచటికి వచ్చి వానియునికిఁ గని మనం
బున లరియు ఔr బెగడెఁ దదు, గ్రనిబిడనిశ్వాసవాతకంపితబలుఁడై.

129


గీ.

వజ్రి వేసెఁ దనదువజ్రంబు దైత్యేంద్రు, మేనుగొండఁ దునిమి మెఱయఁదలఁచి
యదియు దానవేంద్రుఁ డొదవించునిశ్వాస, మారుతాభిహతుల మ్రానుపడియె.

130


క.

ఆచంద మెఱిఁగి ఫాలవి, లోచనజలజాతపత్రలోచనవాణీ
లోచనచకోరచంద్రులు, వాచాలము లైన దివిజవర్గంబులతోన్.

131


వ.

అచ్చటికి వచ్చి మచ్చరంబున నవ్వియచ్చరపరిపంథిపై శూలచక్రదండం
బులు ప్రయోగించిన నవి యవిరళవేగంబున నయ్యోగవిద్యావిదుం
దాఁకి కాఁక యుడిగి శిరీషప్రసవమృదులప్రసారంబు లగుటయుఁ ద్రిజగం
బులు విన్ననయ్యె యోగానలతప్తంబు నుత్తప్తసువర్ణవర్ణంబు నగు నతని
యంగంబున ఖంగుఖంగు మనునినదంబుల కాని సప్తధాతువులుం బాఁతు
కలంగుట కానంబడదయ్యె నయ్యెడ.

132


క.

లోకత్రయవిజ్ఞానక, ళాకుశలుం డైనయాదిలక్ష్మీపతి తీ
వ్రాకారు వాయువుం గని, క్రేకంటం జేరఁ బిలిచి కృప వెట్టుటయున్.

133


వ.

అతండు సాష్టాంగనమస్కృతిచతురుం డై పుండరీకాక్షున కి ట్లనియె.

134


గీ.

దేవ పనిగొమ్ము నాకు నీసేపకునకు, నేఁడు ఫలియించెఁ దపములు నీరజాక్ష
యెద్ది పనిచినఁ గావింతు నెదురులేని, క్రీడనంబున విహరింతుఁ గీర్తిఁ గాంతు.

135


చ.

అన హరి వల్కు నోపవన యంతటివాఁడవ నీవు యోగసి
ద్ధి నితని మేను నొవ్వదు మదీయసుదర్శనతీక్ష్ణధారచే
మనసిజవైరిశూలమును మాటుమణంగె విరించిదండము
న్వనట మునింగెఁ గీడ్వడియె వాసవువజ్రము కంటివేకదా.

136


వ.

ఉపాయంబునం గాని యపాయకరం బగునీసురారిశరీరంబు చిరుంగదుమెఱుం
గు మెఱచి యడంగుతెఱుంగున నీ వితనియంతరంగంబు సొచ్చి మర్మంబులు