పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము - ఉపోద్ఘాతము

27

కొలిపాక యెఱ్ఱన్నకుఁ గృతియిచ్చి యట్లు నరకృతి యిచ్చుటచేఁ గలిగినదోషమును బరిహరించుకొనుతలంపుతోఁ దరువాత మత్స్యపురాణమును రచించి శ్రీరంగనాథున కర్పించినట్లు మత్స్యపురాణమునందలి యీ క్రిందిపద్యము వలన నూహింపఁబడుచున్నది.

సీ.

ఆయురారోగ్యనిత్యైశ్వర్యములు గల్గి విభవంబుతో ధాత్రి వెలయుకొఱకు
ధనమునకై నరాధములసన్నుతిసేయఁ బొడమినపాపముల్ చెడుటకొఱకు
హృదయంబు లక్ష్మీశపదపంకజములందు నిశ్చలవృత్తితో నిలుచుకొఱకు
రౌరవమ్ములు వాసి రయమున వైకుంఠసదనంబునకు వేడ్కఁ జనెడుకొఱకుఁ
బరమవైష్ణవజనులెల్లఁ బ్రస్తుతింప, మత్కృతంబయి హరికథామాన్య మగుచు
నుత్తమంబగు విష్ణుధర్మోత్తరంబు, రంగనాథున కర్పింతు రాణ మెఱసి.

ఇంతకు మున్ను లభించిన యేతత్కవికృతము లగుమత్స్యవరాహపురాణములయం దీకవికాలమును నిర్ణయించుటకుఁ దగినయాధారము లేవియు లభించినవి కావు. కావుననే మ రా. రా. కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమయాంధ్రకవులచరిత్రమునందు “కవికాలమును నిర్ణయించుట కీపుస్తకములు రెంటిలోను నాకాధారము లేవియుఁ గానరాలేదు - - - - నిర్దుష్ట మని చెప్పఁదగిన గ్రంథరచనను బట్టియు శైలిని బట్టియుఁ జూడఁగా నీ పుస్తకములు చిరకాలముక్రిందటనే రచియింపఁబడిన వైనట్టు తోఁచుచున్నది - - - అప్పకవి యీగ్రంథములనుండి లక్ష్యములఁ జేకొనకపోవుటచేత నీకవి యాతనికిఁ దరువాత నున్నాఁడేమో యని యూహ కలుగుచున్నది. కాఁబట్టి తగిన యాధారములు దొరకువఱకును మన మిప్పటి కీకవికాలము క్రీస్తుశకము 1660-వ సంవత్సరప్రాంత మని భావింతము. తెలియనివిషయముల నూహించి పెంచివ్రాయుటకంటె కవికృతగ్రంథములనుండి కొన్నిపద్యముల నుదాహరించి యింతటితో విరమించుట యుక్తము - - -” అని వ్రాసియున్నారు. తరువాత మఱికొంతకాలమునకు మే మీకవి మత్స్యపురాణమును మాకవితాపత్త్రికయందుఁ బ్రకటించియుంటిమి. అప్పటికిని మాకీతనికాలనిర్ణయ మొనరించుటకు మార్గమేమియును దొరకకుండుటం జేసి యాగ్రంథపీఠికయందు “ఈతని కాల మింకను జరిత్రకారులచే సరిగా నిర్ణయింపఁబడలేదు; కాని యపూర్వమగు గ్రంథోపక్రమమును బట్టి చూడ నీతఁడు మిక్కిలి ప్రాచీనుఁ డైనట్లు తోచుచున్నది.” అని వ్రాసియుంటిమి. ఇప్పుడాంధ్రసాహిత్యపరిషత్తువారిచే విశేషవ్యయప్రయాసములతో సంపాదింపఁబడి ప్రచురింపఁబడిన యీనారసింహపురాణమునందుఁ గాశకుశావ