పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము - ఉపోద్ఘాతము

25

నడపవలసిన దేవతాస్తోత్రాదికపద్యములును గృతిపతివంశావతారపద్యములును రచియింపఁజేసి కృతిపొందెను. ఈనారసింహపురాణమునందలి యాశ్వాసాంతగద్యము లన్నియు నీగ్రంథము హరిభట్టుకృత మనియే నొడువుచున్నవి. ఇందలిగద్యములకును హరిభట్టారకుని యితరగ్రంథములయందలి గద్యములకును గొంచె మైనను భేదము కాన్పించుట లేదు. సంస్కృతనారసింహపురాణమునఁ బూర్వభాగము చదలువాడ యెఱ్ఱన్న[1] మొదట నాంధ్రీకరింపఁగా, నిఖిలవిద్యాచతురాస్యుండును రాజమాన్యుఁడును, గవిరాజనుతుఁడును, ధీయుతుఁడు నగు మీతండ్రి హరిభ ట్టిప్పు డుత్తరభాగము నాంధ్రభాషయందు వచనకావ్యము (గద్యపద్యాత్మకమైన ప్రబంధము) గా రచించెను గావున నీ వాప్రబంధమును నాపేర నంకితముఁ గావింపవలయు నని రంగప్రధాని కోరఁగా రాఘవమనీషి యట్లు చేయుట కేమి యభ్యంతర ముండును? ఉండదు వచనకావ్య మనఁగా గద్యపద్యాత్మకమైన ప్రబంధ మనుట కాధారము హరిభట్టుకృత మగువరాహపురాణమున నీక్రిందివచనమునఁ గన్పట్టుచున్నది. "పురాతనకవీశ్వరానుసరణంబును గుకవినిరాకరణంబునుం జేసి శబ్దార్థభావరసాలంకారబంధంబుగా నొక్కప్రబంధం బాంధ్రభాషాభవ్యం బగువచనకావ్యంబుగా రచియింపం బూనిన సమయంబున" అను నీ వచనము గలవరాహపురాణము గద్యపద్యాతకమే కాని కేవల వచనకావ్యము కాదు. దీనింబట్టి చూడఁగా వచనకావ్య మన్న గద్యపద్యాత్మకకావ్య మని హరిభట్టుకాలమున వ్యవహృతిలో నున్నట్లు స్పష్టమగుచున్నది. ఇందలి కవిత్వమునకును హరిభట్టుకృతము లగువరాహపురాణాదులయందలి కవిత్వమునకును సర్వజన వేద్యము లయిన పోలికలుఁ గూడఁ బెక్కులు గలవు. ఆయీకారణములచే నీగ్రంథము నిస్సంశయముగ హరిభట్టకృతమే యని స్పష్టమగుచున్నసు, గించిద్భ్రాంతిజనకము లైనకారణాభాసములచే స్థూలదృష్టికి రాఘవమనీషికృత మని భ్రాంతిపొడము నేమో యని (అనవసర మైనను) ఇంతవఱకు వ్రాయవలసివచ్చినది.

ఏతద్గ్రంథకర్త యగుహరిభట్టు యజుర్వేదివైదికబ్రాహ్మణుఁడు.

  1. ఈతఁడే కవిత్రయమునందలి యెఱ్ఱాప్రెగ్గడ యనిను శంభుదాసుని యింటిపేరు చదలువాడవా రనియు నామిత్రు లొకరు చెప్పిరి. చదలువాడ మల్లయ్యకవికృతమగు విప్రనారాయణచరిత్ర ఈవిషయమునకుఁ బ్రబలప్రమాణముగా నున్నది.