పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 14

లయు బుద్ధిసూక్ష్మతచే సంభవింపవచ్చు నని నాయభిప్రాయము. ఇది ప్రసక్తానుప్రసక్తముగా వ్రాయబడిన విషయము. ప్రస్తుతవిషయ మేమనఁగా?

ఈనారసింహపురాణమును రచియించినకవి హరిభట్టు. ఏకారణముననో కాని, కృతికర్త యగుహరిభట్టుచేఁ గాక యతనికుమారుఁ డైన రాఘవమనీషిచే నీగ్రంథము ప్రోలుగంటి రంగప్రధానికిఁ గృతి యీయఁబడినట్లు కృత్యాదినిబద్ధమైన యీక్రిందిపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.


సీ.

విను రాఘవమనీషి! హనుమత్కృపావరలబ్ధకవిత్వవిలాసమహిమఁ
దనరి యేకాదశద్వాదశస్కంధముల్ తెలిఁగించె మీతండ్రి ధీయుతుండు
హరిభట్టు నిఖిలవిద్యాచతురాస్యుండు రాజమాన్యుఁడు కవిరాజనుతుఁడు
నారసింహపురాణపౌరస్త్యభాగంబుఁ జెదలువా డెఱ్ఱన మొదలుసేయఁ
బ్రతిభ దళుకొత్త నుత్తరభాగ మిప్పు, డాంధ్రభాషను వచనకావ్యం బొనర్చె
నాప్రబంధంబు నా పేర నంకితముగ, నీవు గావింపవలయుఁ గవీంద్రగణ్య!

ఈ పద్యమును బట్టి తండ్రి హరిభట్టు రచియించిన గ్రంథమునే కొడుకు రాఘవమనీషివలనఁ బ్రోలుగంటి రంగన్న కృతిపొందినట్లు స్పష్టమగుచున్నది; కాని తెలుగుకృతులలోఁ దఱచుగా గ్రంథకర్తయే తన గ్రంథమును గృతియిచ్చునాచార ముండుటచేతను, గృతికర్తృభిన్ను లిట్లు కృతు లిచ్చుట మిక్కిలి యరుదుగా నుండుట చేతను, బైసీసపద్య మన్వయసారళ్యము లేమింజేసి స్థూల దృష్టికి, నన్యార్థద్యోతకముగ నుండుటచేతను, మఱియు నందలి "వచనకావ్య" శబ్దమిప్పుడు ప్రత్యేకగద్యకావ్యపర్యాయమై వ్యవహరింపఁబడుచుండుటచేతను, దొలుదొలుత నీ గ్రంధము రాఘవమనీషికృత మైన ట్లించుక భ్రాంతి పొడమవచ్చును. అది కేవలము రజ్జుసర్పభ్రాంతియే కాని మఱియొకటి కాదు. తండ్రి హరిభట్టు గ్రంథమును సంపూర్ణముగా విరచించి యెవ్వరికిని గృతి యీయకమున్నే వార్ధక్యరోగాదులచే నశక్తుఁ డై యుండుటచేతనో, తనంతటఁ దాను నరులకుఁ గృతి యిచ్చి ప్రతిఫలము నొందుట కిచ్చగింపనివాఁ డగుట చేతనో, యొకవేళఁ గాలధర్మము నొందుటచేతనో యతనికుమారుఁడు రాఘవమనీషి కృత్యాదిపద్యములును గృతిభర్తృవంశావతారవర్ణనాదికమును రచించి రంగప్రధానకిఁ గృతి యిచ్చి యతనిచే "సకర్పూరవీటికాశాటికాలంకారపేటికా"ది పారితోషికములు పడసి యుండవచ్చును. ఇట్లే తెనాలిరామకృష్ణకవిచే రచింపబడిన ఘటికాచలమాహాత్య మాతనిపౌత్రుఁడు తీసికొనివచ్చి ఖండోజీ విచిత్రరాయఁ డనురాజునకు సమర్పింపఁగా నాతఁడు వేంకటగిరీంద్రు డనుకవిచేఁ గృత్యారంభమున