పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2

ఉపోద్ఘాతము

135

అని వ్రాసికొని కృతి నామావశేష యయ్యె నని భావించిన స్థితిలో నిది యిప్పు డిట్లు లభించుట యాంధ్రభాషాభిలాషుల కమూల్యమాణిక్యము లభించినట్లే కాదా? జగన్నాథకవిచే నుదాహృతమైన పైసీసపద్యమే ప్రస్తుతము ప్రకటింపఁబడిన యీనారసింహపురాణమునందు విశేషపాఠభేదములతో నిట్లు కనఁబడుచున్నది: ---

సీ.

మందారదామంబు నిందుఖండంబును మౌళిభాగంబునఁ గీలితముగఁ
మణికుండలమ్ములు ఫణికుండలమ్మును గండమండలముల మెండుకొనఁగఁ
జక్రాంకశూలాంకశయముల మాణిక్యకంకణభుజగకంకణము లమరఁ
గనకకౌశేయంబు గజరాజచర్మంబు మునుకొని కటిభాగముల ఘటిల్ల
రమయు నుమయును నుభయపార్శ్వముల నమరఁ
బులుఁగుఱేఁడును నందియుఁ గొలిచి మెలఁగ
వైష్ణవశ్రేష్ఠులును శైవవరులుఁ బొగడ
హరిహరస్ఫూర్తి యేకదేహమునఁ బొలిచె.

ఈరెండుపద్యములకును సీసపాదములలోఁ గొన్నిపాఠాంతరములు గాన్పించుచుండుట వింతగాదు: కాని కడపటి యెత్తుగీతము లొకదానితో నొకదానికిఁ బోలికయే లేక యున్నవి. ఇది చిత్రము! జగన్నాథకవిచే రత్నాకరమున సుదాహరింపఁబడిన దని రామకృష్ణకవిగారు వ్రాసిన సీసగీతి నించుమించుగాఁ బోలుచున్న మఱియొక సీసగీత మీగ్రంథమున నీహరిహరాకృతిసందర్భముననే యిట్లున్నది.


సీ.

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
నీలమును వజ్రఫలకంబుఁ బోలి యుత్ప, లంబుఁ గుముదంబున దగిలచ్చితోడి
యురము నగరాజపుత్త్రిక కునికియైన, యెడమవంకయుఁ గలిగి శ్రీ నిరవుకొనిరి.

మఱియు నిందలి ద్వితీయాశ్వాసమున మఱియొక సందర్భమునఁ జెప్పఁబడిన 15వ సంఖ్య గల కందపద్యములోని కొంతభాగము, మీఁద నుదాహరంపఁబడిన గీతపద్యభాగమును బోలు మన్నది.


క.

చీఁకటియుఁ జంద్రికారస, మేకస్థానంబునంద యిరవొందుగతిన్
నాకౌకోరిపుకులమున్, నాకాలయకులము నొక్కనంటున మెలఁగున్.

మఱియు నీహరిహరరూపైక్యమును వర్ణించు సీసపద్య మింకొకటి గూడ నిందుఁగలదు. పైపద్యములయం దిట్టివిశేషపాఠభేదము లెట్లు గలిగినవో నిర్ణయించుట గాని కవికంఠోక్త పాఠము లివియని నిశ్చయించుటగాని మనకు శక్యము గాదు. తఱచుగా నిట్టి భేదములు లేఖకులయు, సంస్కర్తలయు, ముద్రాపకు