పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

ద్వితీయాశ్వాసము


క.

శ్రీరమణీహృద్రంజన, నారాయణచరణయుగళనారజసేవా
పారాయణ పరితోషిత, నారీనివహాంతరంగ నరసయరంగా.

1


వ.

ఆకర్ణింపు మట్లు శౌనకాదిమునివరులు రోమహర్షుని వలన శరభావతారవృ
త్తాంతం బెఱింగి సంతసించి మఱియు నిట్లనిరి.

2


క.

నరసింహదత్తరాజ్య, స్థిరుఁ డై ప్రహ్లాదుఁ డేమి చేసెనొ తుదఁ ద
చ్చరితంబు వినఁగవలయును, బరిపూర్ణవచోవిశేషపరమార్థజ్ఞా.

3


వ.

అని పలికిన మునివరులకు రోమహర్షణుండు సంతుష్టహృదయుం డై యి
ట్లనియె నట్లు ప్రహ్లాదుండు నరసింహరూపంబు ధరించిన లక్ష్మీవల్లభుని వర
ప్రసాదలబ్ధం బగు రాజ్యంబు నిష్కంటకంబుగఁ బాలనంబు సేయుచు.

4


సీ.

కండక్రొవ్వున రేసి కలహింపఁబూనిన సకలశాత్రవకోటిఁ జక్కుచేసి
న్యాయంబు విడిచి యన్యాయమార్గంబునఁ జనఁబూనుక్రూరులఁ జదియమోది
పరకామినీధనాపహరణోద్యుక్తులౌ చక్రాంకసమయదూషకులఁ దునిమి
శ్వాపదధ్వంసి యై సారంగశశశల్యరురుముఖ్యములకు నారోగ్య మొసఁగి
జవ్వనపువింతసంభృతోత్సాహుఁ డయ్యుఁ, గామరోషాధిరిపులచేఁ గట్టువడక
నవ్యధర్మప్రతిష్టాపనంబుచేత, నొసఁగెఁ బ్రహ్లాదుఁ డానందరసము రసకు.

5


క.

తమనోరికళ్లు గొని వై, రమునం గారించు దైత్యరాజు మఱచి యా
గములఁ బురోడాశము లా, యమరేంద్రాదులు భుజింతు రతనిమఖములన్.

6


సీ.

కలుషసంఘాతంబు గడికండములు చేసి దోషంబులకుఁ జేటుఁద్రోవఁ జూపి
యేనస్సమూహంబు లీనంబు గావించి వృజిననిర్బంధంబు వీడఁదన్ని
యంహోనికాయోగ్రరంహంబు బిట్టాఁగి దురితంబు లింతింత దుమురు చేసి
దుష్కృతశతముల ధూళిలో మ్రగ్గించి పాపరూపము పటాపంచ[1] చేసి
ధరణి ధేనువు నాల్గుపాదముల నిలిచి, తుష్టిఁ బురుషార్థమయపయోవృష్టి గురియ
నేలె రాజ్యంబు దానవాధీశసూతి, నాలుగంచుల నవయౌవనంబునందు.

7
  1. పటాపంచు. మూ.