పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 12


సీ.

పౌలోమిపాలిండ్లపంచఁ జెక్కిలి చేర్చి సుఖయించె బలపాకసుఖవిరోధి
జముఁడు నారకలోకసౌఖ్యోపదేష్ట యై వర్తించె నతిభద్రవర్తనముల
వరుణుండు గావించె సురతరు ప్రసవనిర్గళదచ్ఛమధుపానకౌతుకంబు
వెలిఁ బాఱవైచిన వివిధనిధానంబు లర్థాధిపతి తెచ్చె నాలయమున
కాచరించిరి నిర్విఘ్న మగుతపంబు, మునులు కాలంబు దప్పక చినికె మొగులు
నారసాతలధరణీసురాలయములు, పూర్వగతి నిల్చెఁ జాంచల్యమును[1] దొలంగి.

8


సీ.

అశ్రులు హోమధూమావృతాక్షులయందె మద మత్యుదగ్రద్విరదములందె
వర్ణసాంకర్యంబు వ్రాయుచిత్తరువందె దృఢబంధకలన సత్కృతులయందె
చిరవక్రగతి వధూచికురవల్లరులందె కంపంబు కేతనాగ్రములయందె
తొట్రుకొంట గవాక్షధూపధూమములందె జాడ్యంబు కేలిహంసగతియందె
యధికమగు లేమి లేములయందె యతను, వృత్తివర్తనములయందెవెలయుఁ గాని
లేదు ప్రహ్లాదుఁ డేలెడుమేదినీత, లాంతరాళంబునందు నొక్కింత యైన.

9


సీ.

ఇభగండదానవాహినులు ఘోట్టాణాశ్వఖురవుటరజముచేఁ గ్రుక్కఁబాఱ
నామతీర్థపువేళ నారదముని తనపదములు మధువైరియెదుట నొడువ
శరలూనశత్రుశీర్షములు గన్గొని రాహువక్త్రంబు లని వివస్వంతుఁ డులుకఁ
గీర్తిచంద్రుఁడు పరిస్ఫూర్తిమన్మూర్తి యై భువనజీవంజీవములఁ బొదల్ప
వాసవపురి వితానవిన్యాసముగను, నేల పాదాంగుళీరవినీలముగను
నల్లబలియిక్కబొక్కస మిల్లు గాఁగ, వెలసెఁ బ్రహ్లాదుఁ డాహ్లాదకలితుఁ డగుచు.

10


ఉ.

ఖేచరవైరినందనునికీర్తి దిశావళి బిక్కటిల్లఁగాఁ
జూచి చకోరరాజి నలుచుట్టులుఁ ద్రిమ్మరుఁ జంద్రికామతిన్
వాచవి నంచపిండు గఱవం దమకించు మృణాలవల్లరీ
వీచిక లంచు నిట్టిశుభవిభ్రమశోభితుఁ డెందుఁ గల్గునే.

11


క.

ముసలహతి నసుహృదిభకట, విసర మసురపతి వగుల్ప వెడలినముక్తా
మసృణరజోమండలిసొం, పెసఁగుం దత్కీర్తిమూర్తి హేలావహ మై.

12


క.

మరుదశనభువన మేలెన్, హరిహయపుర మేలె ధరణి యంతయు నేలెం
దరతమభావజ్ఞుం డై, హిరణ్యకశిపూద్భవుం డహీనప్రౌఢిన్.

13


సీ.

ఏవేళఁ జూచినా యింద్రాదిదేవతాలబ్ధోపదానలీలావిభూతి
యేప్రొద్దు చూచినా హితపురోహితముఖోదితతత్త్వవాక్యసంగతమనీష

  1. జాంచల్యమున