పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము. ఆ 1

41


చ.

పురమథనం బొనర్చితివి పొంగువిషానల మారగించి ని
ర్జరులకు మేలుఁ జేసితివి చంగునఁ బైఁబడు బెబ్బులిన్ భయం
కరకరశూలఘాతములఁ గాలునిప్రోలికి నంచి మించి తీ
శ్వర భవదద్భుతోద్ధతి ప్రశంసయొనర్పఁగ నాకు శక్యమే.

222


క.

భవదాకారము లింగ, వ్యవహృతిపై నావహించి యాగమసరణిం
దవిలి భజియించు శైవులు, కవయుదు రతిధన్యముక్తికన్యామణులన్.

223


సీ.

చక్కాడితివొ లేదొ సంవర్తమున జగజ్జాలంబు శూలంబు కేలఁ గ్రాల
ముక్కు చెక్కితొ లేదొ మొక్కలంబున నఱ్ఱు ద్రొక్కి మృత్యువునెత్తితొడుపుఁగత్తి
వక్కలించితో లేదొ వారణాసురగాత్రగోత్రంబు నఖరాగ్రదాత్రలతలఁ
జెక్కువ్రేసితో లేదొ జక్కవచెలికానిఁ బట్టి గీపెట్టి లోఁదట్టువాఱ
మఱియు నీవొన[1]ర్చమానుషక్రమములు, లెక్కసేయువారు లేరు నిజము
గజముఖప్రసూతి గలవేల్ప నా యల్ప, జల్పసరణి నీప్రశంస కురునె.

224


అవతారద్వయోపసంహారము

వ.

అని పంకజాసనుం డాసారాకారసుధాధారం బగు వాక్యప్రకారంబున సారె
సారెం బొగడిన నగుమొగంబు లొలయ నాజగద్రక్షకు లిద్దఱు నావేల్పుఁ
బెద్ద పెట్టినగద్దియపై నతనికోరిక లీరిక లెత్త నీరంబు నీరంబును దుగ్ధంబు
దుగ్ధంబును బారదంబు పారదంబునుం గలసినకరణి నేకీభవించి రాహరిహర
రూపం బాపదసంభవువకు వరప్రదానలాభంబై శోభిల్లె నాక్షణంబ.

225


గీ.

బీజ మొకట రెండుభూజంబు లుదయించు, నోజ నట్టిదివ్యతేజమునను
హరియు హరుఁడు సంగతాంగులై యుదయింప, వదనవలయ మమరె వనజజునకు.

226


సీ.

మందారదామంబు నిందుఖండంబును మౌళిభాగంబుసం గీలితముగ
మణికుండలమ్మును ఫణికుండలమ్మును గండమండలముల మెండుకొనఁగఁ
జక్రాంకశూలాంకశయముల మాణిక్యకంకణభుజగకంకణము లమరఁ
గనకకౌశేయంబు గజరాజచర్మంబు మునుకొని కటిభాగముల ఘటిల్ల
రమయు నుమయును నుభయపార్శ్వముల నలరఁ
బులుఁగుఱేఁడును నందియుఁ గొలిచి మెలఁగ
వైష్ణవశ్రేష్ఠులును శైవవరులుఁ బొగడ
హరిహరస్ఫూర్తి యేకదేహమున నిలిచె.

227


వ.

ఇట్లు నారాయణస్థాణువు లొక్కతనువునం గ్రిక్కిఱిసిన నెలవు హరిహరాభి
ధానం బగుమహాతీర్థప్రధానం బయ్యె నందు.

228
  1. నీవొనర్చు. మూ