పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 12


చంచును జచ్చళికెయుఁ జిత్రతాళంబును సళ్లు కత్రంబును నురుపును దువా
ళంబును బుష్పాంజలి మొద లయిన నటనపటిమంబులు తాళలయంబు లను
సరించి రూపక వార్తిక చిత్రక మానంబులం బ్రవర్తించు చంచుపుట చాచ
పుటాది తాళభంగు లెఱింగి యంగహారకరణస్థానకవృత్తిమండలసంయుక్తం
బుగఁ దాండవం బఖండపాండిత్యంబునఁ బ్రకటించుటయు నన్నిటలన
యనహాటకపటులు హాటికం బగునమ్మహాపారిషదునిం బారితోషికప్రదా
నంబున సన్మానించి రంత విరించి యప్పరమపురుషులం గూర్చి యిట్లనియె.

213


సీ.

ఇది హేమమయపీఠ మే మున్ను గల్పించి పాటించి దాఁచితిఁ బాటవమున
నని బహుయోజనాయతము మాణిక్యసింహాంచితంబును ననర్ఘ్యంబు నైన
గద్దియ యొకటి వేగంబ యాకర్షింప నది భానుబింబసహస్రతుల్య
మగుచు నిల్చుటయు నాహర్యక్షపీఠిపై నజుఁడు నిల్పఁగ హరిహరులు నిలిచి
నీలమును వజ్రఫలకంబుఁ బోలి యుత్ప, లంబుఁ గుముదంబు ననఁదగి లచ్చితోడి
యురము నగరాజపుత్రిక కునికి యైన, యెడమవంకయుఁ గలిగి శ్రీ నిరవుకొనిరి.

214


గీ.

అట్టివేళ నలువ యానందజలరాశి, నోలలాడుచున్నయుల్ల మలర
లోకనాథు లట్టు లేకాసనస్థులై, తేజరిల్లఁ గని నుతించె మఱియు.

215


మ.

ఘనసంసారసముద్రవారినిజదుష్కర్మాగతానేకరో
గనిపీతాంగవిలాసు లై ధనసుహృత్కాంతావియోగార్తి సం
జనితం బైన మనోవ్యథం గుదియు తుచ్ఛస్వాంతు లెల్లన్ జనా
ర్ధన నీ పాదపయోజపత్రజలధారల్ గ్రోల రేకాలమున్.

216


క.

ఉపవాసక్రతుదానము, లపరిమితము లాచరించు నైనం గానీ
త్రిపురాంతకసఖ నీయెడ, నపరాధము దలఁచెనేని యతియును యతియే.

217


క.

నీనామస్మరణంబును, నీనామజపంబుఁ జేయు నిశ్చలహృదయుల్
శ్రీనాయక యపవర్గత, మానాయకు లగుదు రమరమానితు లగుచున్.

218


క.

[1]బుజవైచితి వసురేంద్రుని, భుజమధ్యము చించి భువనమునఁ గలబాధల్
గజరాజనరద నీయ, క్కజపుపదటు నుదుటు మున్ను గని మది మెత్తున్.

219


క.

దానవునెపమునఁ బొడమిన, నీనిర్భరతేజ మిట్లు నిఖిలము నొంచెం
గాని జగన్నాయక నీ, మానస మీజగముమీఁద మచ్చరపడునే.

220


వ.

అని హంసవాహనుం డాహరిం బ్రశంసించి హరున కభిముఖుండై యి ట్ల
నియె.

221
  1. భుజ. మూ.