పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము


కపటమునివృత్తిఁ బ్రౌఢిమ గనిన నేమి, కొదమసామ్రాణి నెక్కి తూకొనిన నేమి
నీకు వెఱతునె పోర నాళీకపత్ర, నయన శంకరభృత్యుండు నందివీఁడు.

183


క.

నను గెలిచికాక శరభేం, ద్రునిపై నడరంగ వశమె దోషాచరమ
ర్దన నీబీరము గీరము, గనిపింపుము నాకుఁ గలనఁ గలనాశక్తిన్.

184


క.

అనుటయు నమ్మాటకు మదిఁ, గనలి యనలశిఖలఁ బోలు కాండము లేసెన్
దనుజారి నందికేశ్వరు, తనువున నవి గ్రోలఁదొణఁగెఁ దద్రుధిరంబున్.

185


క.

కడుదుఱులు గఱచి నట్లై, యొడలు విద్రుచుకొనుచు నందియును బఱచిన నా
కడసంజపొడుపుదేవర, వెడనవ్వుగ నవ్వి శరభవీరుని బొదివెన్.

186


లయగ్రాహి.

వారిరువురుం గదిసి పోరిరి లయాంబుధులు పోరు నెఱజోక మదవారణకులేంద్రుల్
పోరుగతి సింగమ్ములు పోరు నెసకంబున సుదారుణభుజంగములు పోరుమరియాద
న్ఘోరదవనహ్నులొగిఁ బోరు చటులస్ఫురణ మారుతము లుద్దవిడిఁ బోరుబలువీఁకం
దార లిల రాలఁ దిమిరారి రుచి వ్రీల [1]బలవైరి నెరిదూల నిజపౌరుషము వాలన్.

187


మ.

శరభేంద్రుండు మనంబులోఁ దలచె రక్షఃసైనికాభీలముం
జిరవైరోద్ధతభాస్కరోద్భవశిరశ్చేదక్రియామూలముం
బురవప్రావళిభూరిమేఘవిలయప్రోద్భూతవాతూలము
స్వరఘంటాజనితాతిదీర్ఘనినదవ్యాలోలము న్శూలమున్.

188


సీ.

గబ్బిమే నుబ్బునఁ గదిసిన గజదైత్యుకండలు చెండిన గదురుకంపు
నలచిత్రకాయకాయము విదారించినఁ గడుఁజుట్టుకొను విస్రగంధలహరి
యంధకారఃకవాటాంతర్విపాటన మాచరించుటనైన నీచువలపు
కొనగోరఁ జిమ్మి వాకులకొమ్మమగని యౌదల గ్రువ్వఁ బొదువు మేదంపుఁబొలసు
సురకరవిముక్తమందారతరులతాంత, గంధములఁ బొత్తుగలసిన బంధురాత్మ
కీర్తిసౌరభవైభవస్ఫూర్తిచేత, నుడుపుకొను శూల మడరె నమ్మృడుని మ్రోల.

189


క.

పుటములుగొను పెటపెటలుం, జిటచిటలుం గలిగి విలయశిఖు లుదయించెన్
జటిలము లై నిజతేజః, కుటిలములై మూఁడుమొనలక్రూరాస్త్రమునన్.

190


వ.

ఇట్లుసాక్షాత్కరించిన యాశుశుక్షణికీలంబునుం బోని శూలంబుఁ గేలం
గీలించి శరభుం డసురభంజనుపై వైనం బూనుటయు.

191


ఉ.

విక్రమసత్త్వసంయుతుఁడు వీరనృసింహుఁడు లోఁ దలంచె ని
ర్వక్రపరాక్రమక్రమధురంధరసాహసికత్వవిభ్రమో

  1. లీల - మూ.