పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 11


సీ.

చఱచె ఱెక్కల నృకేసరిఁ గిట్టి శరభంబు పక్షీంద్రు గోళ్ల శ్రీభర్త చీరె
శూలి చంచున వనమాలిఫాలము చించె హరి ముష్టిహతి నొంచె నంగజారి
గద నురం బవియించెఁ గమలాక్షుఁ గామారి కొంగవాలున శార్ఙ్గి గొట్టె శివుని
హరుఁడు జానువులఁ గంసారి ప్రక్కలు నొక్కె బ్రమథేశుఁ జక్రి వాలమునఁ జుట్టె
మంత్రితవిభూతి నగ్నులు మండఁజేసి, విష్ణుదేవునిపైఁ జల్లె విషధరుండు
భుజగశయనుండు మాయంపుఁబొగలు ముంచెఁ, బంచవదనునిభూతప్రపంచ మదర.

171


సీ.

క్రోధంబు చాలదే కుముదాహితుని మ్రింగఁ గడకంట మిడుఁగుఱుఁ గదువు లేల
యార్పులే చాలవే యఖిలంబు బధిరంబు గావింప బిగినవ్వుగమక మేల
క్షతజంబు చాలదే జలధులు పొంగింపఁ గమియు మేనుల నుబ్బుచెమట లేల
బుసకొట్లు చాలవే పుడమిదిద్దిరఁ ద్రిప్పఁ జటులహుంకారప్రచార మేల
యెంతయుద్రేక మెంతదుర్దాంతశక్తి, యెంతబింకంబు పొంకంబు నెంత యనుచు
నిలిచి దివమున నిర్జరావలులు పొగడ, నమరవృషభులు చేసి రుగ్రాహవంబు.

172


వ.

ఈ ప్రకారంబున దీప్రాకారంబై యాప్రథమపురుషద్వయం బద్వయం బగు
పౌరుషంబునఁ దారసించి మేరలు మీఱిన వారాకరంబులును నార్పరానియన
లంబులును నుడివోవని యుగ్రవాయువులును నొండొంటిఁ దాఁకిన యుర్వీ
ధరశ్రేష్ఠంబులుం బోలె నాసాముఖనిష్ట్యూతకీలికీలాభీలంబుగ నాలంబు
సేయు సమయంబున నదభ్రభ్రమణచంక్రమణప్లుతపరివర్తనస్థానకోఠ్ఠవణాది
గతి విశేషంబులు గానిపించె నయ్యిద్ధఱయందునుం దారతమ్యంబు
సామ్యంబు చూపె నప్పుడు.

173


సీ.

దివిమాసెఁ గనుమూసె దినకరబింబంబు కురిసె మేఘములు నెత్తురులవాన
విధి దూలె ధర వ్రీలె వేఁగెఁ దారాపంక్తి దిక్కులు చినచిన వ్రక్కలయ్యె
శిఖి మ్రగ్గె శశి మ్రొగ్గెఁ జింతాభరాక్రాంతి నుడుకెత్తెఁ బ్రజలకు నుదరపేటి*
ఫణి గుందెఁ గిటి గందెఁ బ్రథమకచ్ఛపరాజు తల పొట్టలో దూర్చె మలలు వడఁకె
మునులు వెఱచిరి సిద్ధులు ముచ్చముడిఁగి, రసురలోకంబు నసురుసు రయ్యె సిద్ధ
సాధ్యగంధర్వయక్షులు జలదరించి, రాశరభనారసింహులయాహవమున.

174


చ.

హరి శరభంబుఁ దోలియును నాశరభేంద్రుఁడు నారసింహునిం
దెరలఁగఁ జేసియు న్మగుడ దీకొనియు న్సరిపోరి పోరి యా
సురగతి నుండువేళ హరుచుట్టునఁ బారిషదుల్ నరాదులు
న్సురియలు దాల్చి నిల్చిరి వచోనిచయారభటీవృతాశు లై.

175