పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 6

నారసింహపురాణము. ఆ 1

277


వ.

అనిన విని కనలి సరభసంబుగ నాశరభశ్రేష్ఠంబు నిష్ఠురాలాపంబులు దీపింప
నాదివ్యహర్యక్షంబుతో ని ట్లనియె.

162


క.

కులమును రూపును గుణమును, గలవాఁడవె పోలె నొరులఁ గఠినోక్తులచేఁ
గలఁగఁగ నాడెడు నీకును, గులమును రూపంబు నొక్కగుణముం గలదే.

163


సీ.

సర్వ[1]జాతుల యథేచ్ఛాన్నవృత్తి వర్తింతు కుహనావిహారి వై రహివహింతు
వేకాకి వై యుందు వీరంపుగుహలందుఁ బట్టిచూడఁగరాదు పరుఁడ వెపుడు
తండ్రిబిడ్డలకైనఁ దలపెట్టుదువు పోరు కాద్రవేయ[2]ముపోలె నిద్రఘనము
పుణ్యజనశ్రేణి బొలియింతు వూరక దామోదరుఁడవు శ్రీధరుఁడ వెట్లు
కొలుచువారలలచ్చి కే[3]గ్రుచ్చదంతు, గబ్బుమీఱెద విసుమంతగాని లేవు
నిన్ను నీసుద్ధు లన్నియుఁ గన్నవార, మేల నామ్రోల నూరక ప్రేల నృహరి.

164


క.

కదనంబున నాఱెక్కలు, సదనంబుగఁ బొడముదెంచు ఝంఝానిలముల్
వదనంబు సోఁకునప్పుడు, పద నంబుజనాభ తివిచి పఱచెద విచటన్.

165


క.

ధరఁ దూఱిన గిరిఁ జేరిన, శరనిధి గ్రొచ్చిన నభంబు చని చొచ్చిన నా
కరచరణనఖరధారలఁ, బురుషమృగమ నిన్ను నిపుడ పొలియంజూతున్.

166


ఉ.

సంధికి వచ్చినాఁడ విను సర్వజగంబులుఁ గ్రోధవహ్ని కి
ట్లింధన మేలచేసెద వొకించుక శాంతి వహించు నీకు మ
ద్బాంధవముద్ర మే లిటులు పల్కుట నిట్లని వీఁగి కాదు ధీ
బంధురు లైనవారిపరిపాటి సుమీ యిది చాటి చెప్పితిన్.

167


క.

వీరమ కొని విఱవీఁగిన, దారుణమత్త్రోటికోటిదంభోళిమహో
దారతరధారలన నీ, గోరపురూపంబు నడఁగఁగొట్టుదుఁ గలనన్.

168


చ.

అన విని యట్టసహాసభయదాననుఁ డై నరసింహదేవుఁ డా
మినుకులతేజిపుల్గుదొరమీఁదఁ గఠోరకటాక్షవీక్షణం
బొనరఁగఁ బల్కు నీవు వినవో కనవో దనుజారిపౌరుషం
బునదటు నిన్నుఁ బట్టి యిదే పొట్ట పగిల్చెద బిట్టుఁ గూల్చెదన్.

169

నారసింహశరభయుద్ధము

క.

అని యన్యోన్యముఁ బరుసపుఁ, బెనుఁబలుకులు పల్కి వేల్పుప్రెగ్గడలు రయం
బునఁ గదిసి పోరఁ దొడఁగిరి, కనదనలోగ్రస్ఫులింగకలితేక్షణులై.

170
  1. సర్ప
  2. కాద్రవేయను
  3. కృచ్చదంతు - మూ